Indigo Airlines : మురికి సీటు ఇచ్చినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ కు భారీ జరిమానా

ఇండిగో ఎయిర్‌లైన్స్ కు భారీ జరిమానా;

Update: 2025-08-10 10:38 GMT

Indigo Airlines : ఇండిగో ఎయిర్‌లైన్స్ కు ఢిల్లీ కన్స్యూమర్ ఫోరం భారీ జరిమానా విధించింది. ఒక మహిళా ప్రయాణికురాలికి అసౌకర్యమైన, మురికిగా ఉన్న సీటు కేటాయించినందుకు ఈ జరిమానా విధించారు. ఈ కేసులో ఎయిర్‌లైన్స్ తప్పిదం ఉందని నిర్ధారించిన ఫోరం, ఆ మహిళకు పరిహారంగా రూ.1.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీలోని కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, పింకీ అనే మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది. జనవరి 2న బాకు నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నప్పుడు తనకు మురికిగా, పాడైపోయిన, మరకలు ఉన్న సీటు ఇచ్చారని పింకీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమస్యపై తాను ఫిర్యాదు చేసినప్పుడు ఎయిర్‌లైన్స్ సరిగా స్పందించలేదని ఆమె ఆరోపించింది.

ఈ కేసుపై స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్, తాము పింకీ సమస్యను గమనించి, ఆమెకు వేరే సీటు ఇచ్చామని, ఆమె స్వచ్ఛందంగా ఆ సీటులో కూర్చుని ప్రయాణాన్ని పూర్తి చేశారని వాదించింది. విచారణ తర్వాత ఫోరం ఇటీవల ఒక తీర్పులో.. ఇండిగో తన సర్వీసులో లోపం చేసినట్లు భావిస్తున్నాం. ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యం, బాధకు గాను రూ.1.5 లక్షలు చెల్లించాలని ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. దీనితో పాటు కేసు ఖర్చుల కింద మరో రూ.25,000 కూడా చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

ఎయిర్‌లైన్స్ తమ ఇంటర్నల్ ఆపరేషన్ రికార్డుల్లో భాగమైన సిచ్యుయేషన్ డేటా డిస్‌ప్లే రిపోర్ట్ను సమర్పించడంలో విఫలమైందని ఫోరం తన ఆదేశాలలో స్పష్టం చేసింది. స్టాండర్డ్ ఏవియేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఈ నివేదిక చాలా ముఖ్యం. ఈ నివేదికలో ఫ్లైట్ ఆపరేషన్స్, ప్రయాణికులకు సంబంధించిన సంఘటనల రికార్డులు ఉంటాయి. ఈ రిపోర్టు సమర్పించకపోవడం వల్ల ఇండిగో వాదన బలహీనపడిందని ఫోరం తెలిపింది.

Tags:    

Similar News