IndiGo Flight Cancellation: మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? 100% డబ్బు వాపస్ పొందడం ఎలా?
100% డబ్బు వాపస్ పొందడం ఎలా?
IndiGo Flight Cancellation: ఇటీవల దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడటం, విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, టికెట్ల ధరలు విపరీతంగా పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఢిల్లీ విమానాశ్రయం ఇండిగో కొన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు అమలులోకి రావడం. దీంతో అనేక రూట్లలో క్రూ కొరత ఏర్పడి, విమానాలు సమయానికి ఎగరలేకపోయాయి. ఫలితంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాలలో గందరగోళం నెలకొంది.
ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇండిగో సంస్థ ఉపశమన చర్యలు ప్రకటించింది. డిసెంబర్ 5 నుంచి 15, 2025 మధ్య ప్రయాణాలకు సంబంధించి రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ అభ్యర్థనలపై పూర్తి రిఫండ్‌ను ఇండిగో ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం, ఎయిర్‌లైన్ తన తప్పు కారణంగా విమానాన్ని రద్దు చేసినా లేదా ఆలస్యం చేసినా, ప్రయాణీకుడికి 100% రిఫండ్ లభించాలి. టికెట్ నాన్-రిఫండబుల్ అయినప్పటికీ, పన్నులు, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సిందే. అంతేకాకుండా, ప్రయాణీకుడు కోరుకుంటే ఎటువంటి అదనపు రుసుము లేకుండా తరువాత అందుబాటులో ఉన్న విమానంలో ఉచితంగా రీబుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీ విమానం రద్దయితే, రిఫండ్ లేదా రీబుకింగ్ కోసం ఈ ప్రక్రియను అనుసరించవచ్చు. మొదట, ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌లోని Manage Booking విభాగానికి వెళ్లి మీ PNR నంబర్, చివరి పేరును నమోదు చేసి, ఫ్లైట్ స్టేటస్‌ను నిర్ధారించుకోండి. ఆ తర్వాత మీకు పూర్తి రిఫండ్ కావాలా లేదా ఉచిత రీబుకింగ్ కావాలా అనేది నిర్ణయించుకోవాలి. రిఫండ్ కావాలనుకుంటే వెబ్‌సైట్‌లోని Refund for Cancelled Flight ఆప్షన్‌లో వివరాలు నమోదు చేసి అభ్యర్థనను సమర్పించాలి. ఆన్‌లైన్ చెల్లింపు చేసినట్లయితే, రిఫండ్ 5-7 రోజుల్లో అదే కార్డ్/UPI/వాలెట్‌కి జమ అవుతుంది. నగదు చెల్లింపు అయితే, అదే ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో గుర్తింపు కార్డు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి. ఏజెంట్ లేదా థర్డ్-పార్టీ ద్వారా బుకింగ్ చేసినట్లయితే వారు రిఫండ్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఇండిగో సంస్థ తమ ప్రయాణికుల కోసం మరికొన్ని ఉపశమన చర్యలను కూడా ప్రకటించింది. రద్దు లేదా రీషెడ్యూల్ కోసం మొత్తం ఛార్జీలను మాఫీ చేయడంతో పాటు, ఆటోమేటిక్ రిఫండ్‌ల ద్వారా డబ్బులను నేరుగా చెల్లింపు మోడ్‌లోకి పంపుతోంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులకు తాత్కాలికంగా వేలాది హోటల్ రూమ్‌లు, రవాణా మరియు ఆహారం ఏర్పాట్లు చేసింది. అలాగే, విమానాశ్రయాలలో ప్రయాణికులకు సహాయం చేయడానికి అదనపు సిబ్బందిని కూడా నియమించింది. ఈ చర్యలు కొంతవరకు ప్రయాణికుల అసంతృప్తిని తగ్గించడానికి దోహదపడతాయి.