Indo-US Trade Deal : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు..ముగింపు దశకు చేరుకున్న చర్చలు

ముగింపు దశకు చేరుకున్న చర్చలు

Update: 2026-03-06 06:48 GMT

Indo-US Trade Deal : భారత్, అమెరికా దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య కుదరబోయే భారీ ట్రేడ్ డీల్ దాదాపు తుది దశకు చేరుకుందని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యంలో కూడా భారత్-అమెరికా బంధం రాబోయే దశాబ్ద కాలంలో మరింత ధృడంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

రక్షణ, భద్రతలో సరికొత్త అధ్యాయం

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని లాండౌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా వాణిజ్యం వంటి అంశాల్లో ఇరు దేశాలు ఒకే తాటిపై ఉన్నాయి. పవర్, పర్పస్ అండ్ పార్టనర్‌షిప్ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాబోయే కొన్ని ఏళ్లు ఇరు దేశాల రక్షణ బంధానికి పునాదిరాళ్లుగా నిలుస్తాయని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా సులభతరం కానుంది.

ఇంధన రంగంలో భారత్‌కు అమెరికా అండ

భారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా లేదా గల్ఫ్ దేశాలపైనే కాకుండా అమెరికాను కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా చూడాలని లాండౌ సూచించారు. అమెరికా వద్ద అపారమైన ఇంధన వనరులు ఉన్నాయని, భారత్ అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటి వనరుల కోసం భారత్ తన వనరులను వైవిధ్యపరుచుకోవడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

వాణిజ్య ఒప్పందంతో కలిగే ప్రయోజనాలు ఇవే

ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై విధించిన అదనపు టారిఫ్‌లను కూడా అమెరికా తొలగించింది. ప్రతిగా, భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించేందుకు అంగీకరించింది. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన విమాన విడిభాగాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటివి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Tags:    

Similar News