Insurance Claim : ఇన్సూరెన్స్ కంపెనీ క్లైయిమ్ రిజెక్ట్ చేసిందా..మీ డబ్బులు వసూలు చేసుకునే సీక్రెట్ ఇదే

మీ డబ్బులు వసూలు చేసుకునే సీక్రెట్ ఇదే

Update: 2025-12-29 06:28 GMT

Insurance Claim : ఆపద సమయంలో ఆదుకుంటుందని మనం ఎంతో నమ్మకంతో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అయితే, తీరా జబ్బు చేసి హాస్పిటల్ పాలైనప్పుడు బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే ఆ ఆందోళన వర్ణనాతీతం. ఇలాంటి సమయాల్లో చాలా మంది భయం లేదా నిరాశతో వెనక్కి తగ్గిపోతారు. కానీ క్లెయిమ్ రిజెక్ట్ అయినంత మాత్రాన మీ ప్రయత్నం వృధా అయినట్లు కాదు. సరైన పద్ధతిలో పోరాడితే బీమా కంపెనీ మెడలు వంచి మీ డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. క్లెయిమ్ తిరస్కరణకు గురైతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదవండి: క్లెయిమ్ రిజెక్ట్ అయిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని మీ పాలసీ డాక్యుమెంట్లను బయటకు తీయడం. కంపెనీ ఏ కారణంతో మీ క్లెయిమ్‌ను తిరస్కరించిందో చూడండి. ఆ వ్యాధి మీ పాలసీ పరిధిలోకి వస్తుందా లేదా అనేది సరిచూసుకోండి. ఉదాహరణకు, బ్యాక్టీరియల్ మెనింజైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు చాలా పాలసీలలో కవర్ అవుతాయి. కానీ కొన్ని మెడికల్ కండిషన్లు ఉంటేనే ఇస్తామని షరతులు పెడతారు. ఒకవేళ మీ మెడికల్ సర్టిఫికెట్లలో డాక్టర్ ఆ వ్యాధిని ధృవీకరించి, అది మీ పాలసీ జాబితాలో ఉంటే, మీరు ఖచ్చితంగా కంపెనీ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు.

బీమా యుద్ధంలో మీ దగ్గర ఉన్న బలమైన ఆయుధాలు మీ మెడికల్ రిపోర్ట్స్ మాత్రమే. హాస్పిటల్ అడ్మిషన్ పేపర్లు, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లు, డయాగ్నస్టిక్ రిపోర్ట్స్, వ్యాధి తీవ్రతను తెలిపే సర్టిఫికెట్లను అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. కంపెనీ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు వాదించాలంటే ఈ ఆధారాలే కీలకం. ఒకవేళ బీమా కంపెనీ మీ ఫిర్యాదును పట్టించుకోకుండా, పాత కారణాన్నే సాకుగా చూపిస్తూ క్లెయిమ్ ఇవ్వము అని మొండికేస్తే, మీరు తదుపరి స్థాయికి వెళ్లాల్సి ఉంటుంది.

బీమా కంపెనీ మాట వినకపోతే, ప్రతి కంపెనీలో ఉండే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ టీమ్‎కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ ఒంబుడ్స్‌మన్‎ను సంప్రదించండి. ఇక్కడ ఫిర్యాదు చేయడం పూర్తిగా ఉచితం. ఒంబుడ్స్‌మన్ మీ దగ్గరున్న మెడికల్ రికార్డులను, పాలసీ నిబంధనలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తారు. ఇటీవల ఒక కేసులో, రోగికి ఆరు వారాలకు పైగా నరాల సంబంధిత సమస్య ఉందని డాక్టర్ ధృవీకరించినప్పటికీ కంపెనీ క్లెయిమ్ నిరాకరించింది. కానీ ఒంబుడ్స్‌మన్ జోక్యంతో కంపెనీ తలొగ్గాల్సి వచ్చింది. పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని నామినీకి చెల్లించాలని ఆదేశించింది.

ఈ మొత్తం ప్రక్రియ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. పాలసీ తీసుకునే ముందే నిబంధనలను సరిగ్గా చదవాలి. అలాగే ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు అన్ని రిపోర్టులను భద్రంగా దాచుకోవాలి. నిజాయితీగా ఉన్న వాస్తవాలను, పాలసీ రూల్స్‌ను సరిగ్గా ప్రెజెంట్ చేస్తే, ఏ బీమా కంపెనీ కూడా మీ క్లెయిమ్‌ను అడ్డుకోలేదు. గుర్తుంచుకోండి. సరైన వేదికపై మీ గళం వినిపిస్తే న్యాయం ఖచ్చితంగా మీ పక్షమే ఉంటుంది.

Tags:    

Similar News