Indian Railways: రైలు ప్రయాణికుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న అక్రమ వ్యాపారులపై భారతీయ రైల్వే కఠిన చర్యలు చేపట్టింది. ఐఆర్‌సిటిసి ఆధ్వర్యంలోని క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు దేశవ్యాప్తంగా జరిపిన మెరుపు దాడుల్లో అనుమతి లేని 8 వేలకు పైగా నీళ్ల బాటిళ్లు, నాణ్యతా ప్రమాణాలు లేని ఐస్‌క్రీమ్‌లు, ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రైలు ప్రయాణాల్లో ప్యాక్ చేసిన నీళ్ల బాటిళ్లు, తినుబండారాలు కొనుగోలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఐఆర్‌సిటిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ తనిఖీల్లో అనుమతి లేని పదార్థాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తేలింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని నీళ్లు, ఆహార పదార్థాల వల్ల ప్రయాణికులు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ముప్పును అరికట్టడానికి ఐఆర్‌సిటిసికి చెందిన క్విక్ రెస్పాన్స్ బృందాలు వాణిజ్య విభాగంతో కలిసి స్టేషన్లు, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి.

లక్నో నుంచి చండీగఢ్ వరకు భారీగా సీజ్

ఉత్తర రైల్వే పరిధిలో జరిగిన దాడుల గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. అధికారుల తనిఖీల్లో అనుమతి లేని ఏకంగా 8,349 నీళ్ల బాటిళ్లు పట్టుబడ్డాయి. లక్నో పరిధిలో జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు 117 రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి 5,241 నాణ్యత లేని వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 10న చండీగఢ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అంబాలా, లుధియానా, అమృత్‌సర్, జమ్మూ వంటి కీలక స్టేషన్లలో 51 రైళ్లను పరిశీలించి మరో 3,108 నకిలీ బాటిళ్లను పట్టుకున్నారు.

మంచినీళ్లే కాదు ఐస్‌క్రీమ్‌లు కూడా పట్టివేత

ఈ ఆకస్మిక దాడులు కేవలం వాటర్ బాటిళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అంబాలాలో జరిగిన తనిఖీల్లో అనుమతి లేని ఐస్‌క్రీమ్‌లు, ఫ్లేవర్డ్ మిల్క్‌కు చెందిన 13 కార్టన్లను అధికారులు సీజ్ చేశారు. సహారన్‌పూర్ స్టేషన్‌లో కూడా నాణ్యతా ప్రమాణాలు లేని ఐస్‌క్రీమ్‌లు, ప్యాక్ చేసిన పానీయాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలన్నింటినీ వెంటనే నాశనం చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

ఈ తనిఖీల పర్వం కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితం కాకుండా దేశమంతటా కొనసాగుతోంది. వెస్ట్రన్ జోన్‌లోని సబర్మతి స్టేషన్‌లో రెండు రైళ్లలోకి అక్రమంగా తరలిస్తున్న మజ్జిగ, నీళ్ల బాటిళ్లను సీజ్ చేశారు. హౌరా స్టేషన్‌లో జరిపిన దాడిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహారాన్ని అధికారులు నాశనం చేశారు. గౌహతి, అగర్తలా, న్యూ జల్ పాయి గురి వంటి ఈశాన్య ప్రాంతాల్లో కూడా కేటరింగ్ యూనిట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నాణ్యత, పరిశుభ్రత పాటించని, ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసే కేటరింగ్ వెండర్లపై లైసెన్సు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఐఆర్‌సిటిసి హెచ్చరించింది.

Tags: