PPF vs SIP: సంవత్సరానికి 1.5 లక్షల రూపాయలు దాచాలని అనుకుంటున్నారా? 15 ఏళ్ల సుదీర్ఘ కాలానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మంచిదా లేక మ్యూచువల్ ఫండ్ సిప్ లాభదాయకమా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రభుత్వ భద్రతతో కూడిన నిధి ఒకవైపు ఉంటే, స్టాక్ మార్కెట్ వేగంతో కోట్లు తెచ్చిపెట్టే అవకాశం మరొకవైపు ఉంది. పీపీఎఫ్ అనేది భారత ప్రభుత్వం అందించే అత్యంత ప్రాచీనమైన, నమ్మకమైన పొదుపు పథకం. దీనిపై వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ ద్వారా 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా నిర్ణీత గడువు ముగిశాక అసలుతో సహా లాభం కచ్చితంగా చేతికి వస్తుంది. దీనికి భిన్నంగా సిప్ ద్వారా వేసే డబ్బులు నేరుగా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ అవుతాయి. మార్కెట్ సానుకూలంగా ఉంటే ఊహించని రేంజ్‌లో లాభాలు వస్తాయి. అదే సమయంలో మార్కెట్ పడిపోతే లాభాల శాతం తగ్గే ముప్పు కూడా ఉంటుంది.

15 ఏళ్ల పెట్టుబడి క్యాలిక్యులేషన్ ఇదే

ఈ రెండింటి వ్యత్యాసాన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. రాహుల్, అమిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఏడాదికి 1.5 లక్షల రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు అనుకుందాం. రాహుల్ తన డబ్బును పీపీఎఫ్‌లో జమ చేయగా, అమిత్ నెలకు 12,500 రూపాయల చొప్పున సిప్ ప్రారంభించాడు. 15 సంవత్సరాల కాలంలో ఇద్దరూ జమ చేసే మొత్తం 22.5 లక్షల రూపాయలు.

15 ఏళ్ల గడువు ముగిశాక లభించే రాబడి విషయానికి వస్తే, పీపీఎఫ్ ద్వారా 7.1 శాతం వడ్డీతో రాహుల్‌కు దాదాపు 40.7 లక్షల రూపాయల ఫండ్ సమకూరుతుంది. అమిత్ చేసిన సిప్పై సగటున 12 శాతం వార్షిక రాబడి లభిస్తే, ఆ మొత్తం ఏకంగా 63.1 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. ఈ లెక్కన సిప్ ఎంచుకున్న అమిత్‌కు పీపీఎఫ్ కంటే దాదాపు 22 లక్షల రూపాయల అదనపు లాభం లభించే అవకాశం ఉంది.

మార్కెట్ రాబడి ఆధారంగా మారే గణాంకాలు

సిప్లో వచ్చే రాబడి స్థిరంగా ఉండదు. అంతా మార్కెట్ నడకపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 15 సంవత్సరాల కాలంలో సగటు రాబడి కేవలం 8 శాతానికే పరిమితమైతే, మొత్తం ఫండ్ 43 లక్షల రూపాయలుగా మారుతుంది. ఈ పరిస్థితిలో పీపీఎఫ్, సిప్ మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. అదే రాబడి 10 శాతానికి పెరిగితే 52 లక్షల రూపాయలు, ఒకవేళ 15 శాతానికి చేరితే ఏకంగా 84 లక్షల రూపాయల భారీ నిధి సిద్ధమవుతుంది.

ట్యాక్స్ మినహాయింపుల్లో ఏది టాప్?

లాభాలతో పాటు పన్ను నిబంధనలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో పీపీఎఫ్ పూర్తి ఆధిక్యంలో ఉంది. పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసే సొమ్ము, ప్రతీ సంవత్సరం జమయ్యే వడ్డీ, 15 ఏళ్ల తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తం.. ఈ మూడింటిపై ఒక్క రూపాయి కూడా పన్ను పడదు. ఇది పూర్తి ట్యాక్స్ ఫ్రీ స్కీమ్. సిప్ల ద్వారా వచ్చే లాభాలపై మాత్రం మీరు ఎంచుకున్న ఫండ్ రకాన్ని బట్టి వర్తించే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెట్టుబడిదారులకు బెస్ట్ స్ట్రాటజీ

ఎలాంటి రిస్క్ లేకుండా ప్రశాంతంగా నిర్ణీత లాభం కావాలనుకునేవారికి పీపీఎఫ్ సరైన మార్గం. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి పెద్ద మొత్తంలో సంపద సృష్టించాలనుకునేవారికి సిప్ అద్భుతమైన సాధనం. నిపుణుల సలహా ప్రకారం మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా విభజించడం మంచిది. ఏడాదికి కేటాయించే 1.5 లక్షల రూపాయలలో 75,000 రూపాయలు పీపీఎఫ్‌లో, మిగిలిన 75,000 రూపాయలు సిప్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వ భద్రతతో పాటు మార్కెట్ తెచ్చే అధిక లాభాలను కూడా పొందవచ్చు.

Tags: