2000 Notes : ఇంకా బీరువాల్లో దాచుకున్నారా? 2000 నోట్లపై ఆర్బీఐ సీరియస్ వార్నింగ్..వెంటనే ఇలా చేయండి
2000 నోట్లపై ఆర్బీఐ సీరియస్ వార్నింగ్..వెంటనే ఇలా చేయండి
2000 Notes : మీ ఇంట్లో బీరువాలోనో, పాత డ్రాయర్లలోనో ఇంకా 2000 రూపాయల నోట్లు మిగిలిపోయి ఉన్నాయా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. దేశంలో 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించి అప్పుడే రెండేళ్లు కావస్తోంది. మే 2023లో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రజల వద్ద సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉన్నట్లు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. 31 అక్టోబర్ 2025 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో 98.37 శాతం వెనక్కి వచ్చినప్పటికీ, ఆ మిగిలిన కొద్దిపాటి నోట్లు ఎవరి వద్ద ఉన్నాయో తెలియక ఆర్బీఐ మరోసారి ఈ అప్‌డేట్ ఇచ్చింది.
చాలా మందికి ఉన్న పెద్ద సందేహం ఏంటంటే.. ఇప్పుడు ఈ నోట్లు చెల్లుతాయా? లేదా? అని. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2000 నోట్లు ఇప్పటికీ లీగల్ టెండర్ అంటే వీటి విలువ అలాగే ఉంటుంది. కానీ, వీటిని మీరు బయట షాపుల్లోనో, మార్కెట్లలోనో వస్తువుల కొనుగోలుకు ఉపయోగించలేరు. సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో కూడా వీటిని మార్చుకునే గడువు 2023 అక్టోబర్ 7తోనే ముగిసింది. అయితే వీటిని మార్చుకోవడానికి ఇప్పటికీ మీకు అవకాశం ఉంది. ఆర్బీఐ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా పాత పద్ధతుల్లో ఈ నోట్లను స్వీకరిస్తోంది.
మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ ఆఫీసులు ఉన్నాయి. ఒకవేళ మీరు అంత దూరం వెళ్లలేకపోతే, ఏదైనా పోస్టాఫీసు ద్వారా మీ నోట్లను ఆర్బీఐ కార్యాలయానికి పంపవచ్చు. అక్కడ అవి వెరిఫై అయిన తర్వాత నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. దీనికోసం మీరు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులతో పాటు బ్యాంక్ వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుంది.
2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ అవసరాల కోసం ఈ గులాబీ రంగు నోట్లను తీసుకొచ్చారు. కానీ 2018-19 నుంచే వీటి ముద్రణను నిలిపివేశారు. ప్రజల రోజువారీ లావాదేవీలకు ఈ పెద్ద నోట్లు అంతగా ఉపయోగపడటం లేదని భావించి వీటిని పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీ దగ్గర ఉన్న నోట్లు గడువు ముగిసిందని రిజెక్ట్ అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాటిని ఇంట్లోనే ఉంచుకుంటే మాత్రం అది కేవలం కాగితంతో సమానం. కాబట్టి వెంటనే ఆర్బీఐ కార్యాలయాన్ని సంప్రదించి మీ సొమ్మును ఖాతాలో వేయించుకోవడం ఉత్తమం.