ITR Filing : ట్యాక్స్ కట్టేవాళ్లకు బ్యాడ్ న్యూస్..కరాఖండిగా చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

కరాఖండిగా చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

Update: 2025-09-10 11:45 GMT

ITR Filing : ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసే వారికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025 అని, ఈ తేదీని ఇకపై పొడిగించబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే 31 జూలై నుండి 15 సెప్టెంబర్ వరకు 45 రోజుల గడువును పొడిగించినందున, ఇది పన్ను చెల్లింపుదారులకు సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆడిట్ చేయబడని ఖాతాలున్న పన్ను చెల్లింపుదారులకు సెప్టెంబర్ 15 చివరి అవకాశం అని మంత్రిత్వ శాఖ తెలిపింది. గడువులోగా రిటర్న్‌లు దాఖలు చేయడంలో విఫలమైతే లేట్ ఫీజులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రభుత్వం ఈసారి డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం లేదని, పన్ను చెల్లింపుదారులు వీలైనంత త్వరగా తమ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. పోర్టల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, డేటా మ్యాచింగ్‌లో లోపాలు, ఫారం జారీ చేయడంలో జాప్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం డెడ్‌లైన్‌ను పొడిగించదని ఓ నివేదికలో పేర్కొన్నారు.

సమయానికి ఐటీఆర్ దాఖలు చేయడం ఎందుకు ముఖ్యం?

గడువులోగా రిటర్న్‌లు దాఖలు చేస్తే లేట్ ఫీజులు, వడ్డీల నుండి తప్పించుకోవచ్చు. సకాలంలో రిటర్న్ దాఖలు చేయడం వల్ల పన్ను వాపసు (రీఫండ్) ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఐటీఆర్ మీ ఆర్థిక రికార్డుగా పనిచేస్తుంది. రుణాలు తీసుకోవడానికి, వీసా పొందడానికి, ఇతర ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు ఇది అవసరం.

ఇప్పటివరకు ఎంతమంది రిటర్న్‌లు దాఖలు చేశారు?

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి ఇప్పటివరకు సుమారు 5 కోట్ల రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. వీటిలో 4.7 కోట్ల రిటర్న్‌లు వెరిఫై కాగా, 3.4 కోట్ల రిటర్న్‌లు ప్రాసెస్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంఖ్యలు మెరుగ్గా ఉన్నాయి. ఇది డిజిటల్ పద్ధతిలో పన్ను దాఖలు చేసే ధోరణి పెరుగుతోందని సూచిస్తుంది.

ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే ఏమవుతుంది?

మీరు సెప్టెంబర్ 15 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రుసుము రూ. 5,000 వరకు ఉండవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కన్నా తక్కువ ఉంటే, లేట్ ఫీజు గరిష్టంగా రూ. 1,000 వరకు ఉంటుంది. దీంతో పాటు, చెల్లించాల్సిన పన్ను మొత్తంపై నెలకు 1% చొప్పున వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, సమయానికి రిటర్న్‌లు దాఖలు చేయడం ఎప్పుడూ మంచిది.

Tags:    

Similar News