ITR Refund Delay : ఐటీఆర్ రిఫండ్‌లో ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ తప్పులు చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి
ఈ తప్పులు చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి;
ITR Refund Delay : ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత రిఫండ్ వస్తుందంటే పన్ను చెల్లింపుదారులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ఎంత కాలమైనా రిఫండ్ ఖాతాలో జమ కాకపోతే ఆందోళన పెరుగుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ ఆలస్యానికి గల సాధారణ కారణాలు ఏంటో తెలుసుకుని, మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.
ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం
ఐటీఆర్ ఫైల్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు మీ రిటర్న్‌ను ఈ-వెరిఫై చేస్తేనే అది పూర్తయినట్లు లెక్క. ఈ-వెరిఫికేషన్ లేకుండా, ఆదాయ పన్ను శాఖ మీ రిటర్న్‌ను ప్రాసెస్ చేయదు. దీనివల్ల రిఫండ్ ప్రక్రియ ఆగిపోతుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన 120 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి. మీరు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, లేదా డీమ్యాట్ అకౌంట్ వంటి పద్ధతుల ద్వారా మీ రిటర్న్‌ను ఈ-వెరిఫై చేసుకోవచ్చు.
ఆధార్, పాన్ లింకింగ్‌లో సమస్యలు
ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ రెండింటిలో మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిపోలకపోతే లింకింగ్ ప్రక్రియ పూర్తికాదు. ఒకవేళ లింకింగ్ సరిగ్గా జరగకపోతే, మీ రిఫండ్ ప్రాసెసింగ్ మొదలు కాదు. కాబట్టి, ముందుగా మీ పాన్, ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని, వాటిని సరిగ్గా లింక్ అయ్యాయని నిర్ధారించుకోండి.
డాక్యుమెంట్ మిస్ మ్యాచ్
ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు సమర్పించిన ఫామ్ 26ఏఎస్, ఫామ్ 16, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లలోని వివరాలు సరిపోలకపోతే రిఫండ్‌లో జాప్యం జరగవచ్చు. ఉదాహరణకు, మీ ఫామ్ 26ఏఎస్‌లో కనిపించే టీడీఎస్ వివరాలను మీరు మీ ఐటీఆర్ ఫామ్‌లో నమోదు చేయకపోతే, పన్ను శాఖ మీ నుంచి వివరణ కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో రిఫండ్ ప్రాసెసింగ్ నిలిచిపోతుంది.
తప్పుడు లేదా అసంపూర్తి సమాచారం ఇవ్వడం
పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి కొందరు పన్ను చెల్లింపుదారులు కొన్ని తగ్గింపులను క్లెయిమ్ చేస్తారు. కానీ, వాటికి సంబంధించిన సరైన పత్రాలు వారి దగ్గర ఉండవు. ఇలాంటి అనుమానాస్పద కేసులలో పన్ను శాఖ మీ రిటర్న్‌ను మరింత పరిశీలించడానికి ఆపివేస్తుంది. ముఖ్యంగా, మీరు పెద్ద మొత్తంలో రిఫండ్‌ను క్లెయిమ్ చేస్తే, అదనపు తనిఖీలు తప్పనిసరిగా జరుగుతాయి. ఒకవేళ మీరు తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే, రిఫండ్ ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా తిరస్కరించబడవచ్చు.
బ్యాంక్ ఖాతా వివరాలలో తప్పులు
ఐటీఆర్ రిఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తప్పుడు బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ నమోదు చేస్తే రిఫండ్ నిలిచిపోతుంది. అలాగే, మీ బ్యాంక్ ఖాతా ఐటీ పోర్టల్‌లో ముందుగా వెరిఫై అయ్యి ఉండాలి. ఈ వెరిఫికేషన్ జరగకపోతే రిఫండ్ ప్రాసెసింగ్ ఆగిపోతుంది. మీరు మీ ఆదాయ పన్ను పోర్టల్‌లోకి వెళ్లి, మీ బ్యాంక్ ఖాతా వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో, వెరిఫై అయ్యి ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.