Retail Inflation: ఆర్‌బీఐ లక్ష్యం ఫెయిల్.. జులైలో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం
జులైలో మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం
Retail Inflation: ఆగస్టు మొదలయ్యే నాటికి సామాన్యుడి జేబుకు కత్తెర పడేలా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. జూన్ నెలలో 4.38 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జులై నాటికి 4.45 శాతానికి పెరిగింది. కొత్త వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే ఈ హఠాత్ పెరుగుదలకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ నిర్దేశించిన భద్రతా పరిమితిని దాటడంతో మున్ముందు వడ్డీ రేట్ల కోతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల రేట్లకు రెక్కలు
ఆహార ద్రవ్యోల్బణ సూచీ జూన్‌లో 5.32 శాతం ఉండగా, జులై నాటికి 5.52 శాతానికి పెరిగింది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లోనే నిత్యావసరాల ధరల మంట ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వంటింట్లో రోజూ వాడే అల్లం ద్రవ్యోల్బణం 83.62 శాతానికి ఎగబాకి రికార్డు సృష్టించింది. వెల్లుల్లి ద్రవ్యోల్బణం 35.36 శాతానికి చేరగా, ఉల్లిపాయల ధరల సూచీ 4.73 శాతం నుంచి ఏకంగా 22.54 శాతానికి పెరిగింది. కొన్ని కూరగాయలు ఊరటనిచ్చినప్పటికీ, దైనందిన వంటకాల వ్యయం మాత్రం సగటు గృహిణికి సవాలుగా మారింది.
ఆలుగడ్డలు, టమాటాలు స్వల్ప ఊరట
అల్లం, ఉల్లిపాయలు మండిపోతున్నప్పటికీ కొన్ని రకాల కూరగాయల ధరలు తగ్గడం ఉపశమనం కలిగించే అంశం. గతేడాదితో పోలిస్తే ఆలుగడ్డల ధరలు 16.56 శాతం పడిపోయాయి. టమాటా, బెండకాయ, బటానీ ధరలు కూడా కొంతమేర తగ్గుముఖం పట్టడంతో కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లయింది.
ప్రయాణ చార్జీలు, బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కాస్ట్లీ
ధరల మంట కేవలం వంటగదికే పరిమితం కాలేదు. రవాణా రంగంలో ద్రవ్యోల్బణం 4.43 శాతానికి పెరగడంతో ప్రయాణ ఖర్చులు, సరుకుల రవాణా భారంగా మారాయి. దుస్తులు, పాదరక్షల విభాగంలో 3.38 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. పర్సనల్ కేర్, కాస్మోటిక్స్ ఉత్పత్తుల్లో ఏకంగా 14.77 శాతం ద్రవ్యోల్బణం నమోదవ్వడం గమనార్హం. రెస్టారెంట్లు, హోటల్ సర్వీసుల చార్జీలు 7.72 శాతం పెరిగాయి.
ఆర్‌బీఐ కొత్త అంచనాలు
ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడాన్ని ఆర్‌బీఐ గమనించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) గాను ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ద్రవ్యపతి విధాన సమీక్షలో తెలిపింది. మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.