Petrol Export: చరిత్రలోనే తొలిసారి.. భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ ఎగుమతి
భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ ఎగుమతి
Petrol Export: ప్రపంచ చమురు మార్కెట్‌లో కలలో కూడా ఊహించని విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. సమస్త ప్రపంచానికి ఇంధనాన్ని ఎగుమతి చేసే రష్యాలో తీవ్రమైన పెట్రోల్ కొరత ఏర్పడింది. బ్లూమ్‌బెర్గ్ అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్ నుంచి బయలుదేరిన భారీ పెట్రోల్ షిప్‌మెంట్ ఆగస్టు 5 నాటికి రష్యా తీరానికి చేరుకుంది. దక్షిణ ఆసియా దేశమైన భారత్ నుంచి రష్యా మోటార్ ఫ్యూయల్ కొనుగోలు చేయడం చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం గమనార్హం. గుజరాత్ తీరం నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి రష్యా చేరుకున్న ఈ చమురు నావలు, అక్కడ ఇంధన సంక్షోభం ఎంత తీవ్ర స్థాయికి చేరిందో స్పష్టంగా చూపుతున్నాయి.
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
రష్యాలో ఈ స్థాయి ఇంధన కొరత ఏర్పడటానికి ప్రధాన కారణం ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధమే. గడిచిన కొన్ని నెలలుగా ఉక్రెయిన్ బలగాలు రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా వినాశకర డ్రోన్, మిసైల్ దాడులు ప్రారంభించాయి. వరుస దాడుల కారణంగా రష్యా ముడిచమురు శుద్ధి సామర్థ్యం రోజుకు కేవలం 36 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే ఇది మూడో వంతు తగ్గిపోవడమే. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రష్యా, అంతర్గత అవసరాల కోసం తమ ఎగుమతులపై నిషేధం విధించుకోవాల్సి వచ్చింది.
ఆదుకున్న భారత్ నాయరా ఎనర్జీ
ఈ గలిబిలి సమయంలో రష్యాకు భారత్‌కు చెందిన నాయరా ఎనర్జీ పెద్ద దిక్కుగా నిలిచింది. దీని వెనుక పెద్ద వ్యాపార సంబంధమే ఉనికిలో ఉంది. రష్యా ప్రభుత్వ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్కు నాయరా ఎనర్జీలో ఏకంగా 49.13 శాతం వాటా ఉంది. గుజరాత్‌లోని వాడినార్ వద్ద రోజుకు 4 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం గల భారీ రిఫైనరీని నాయరా నడుపుతోంది. గతంలో నాయరా నుంచి చమురు కొనుగోలు చేసే హిందూస్థాన్ పెట్రోలియం సొంత శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో నాయరా కంపెనీకి రష్యా ఒక అద్భుతమైన నయా మార్కెట్‌గా మారింది.
నడిసముద్రంలో డార్క్ ఫ్లీట్ నావలు
అంతర్జాతీయ ఆంక్షల కన్నుగప్పి రష్యాకు చమురు తరలించడం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం గుజరాత్ వాడినార్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఓడలు, ఈజిప్ట్ సమీపంలోని నడిసముద్రంలో తమ వద్ద ఉన్న పెట్రోల్‌ను ఇతర దేశాల పతాకాలతో తిరిగే ఓడల్లోకి మార్చాయి. దీన్నే టెక్నికల్ భాషలో షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్ అంటారు. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి లోకేషన్లు దాచేస్తూ ప్రయాణించే డార్క్ ఫ్లీట్ ఓడల ద్వారా నాయరా సంస్థ ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించినట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.