UMANG App: పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఉమాంగ్ యాప్ అత్యంత ఆదరణ పొందుతోంది. రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం జులై 2026 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా 2,575 కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 880 సేవలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల 1,695 సేవలు ఉన్నాయి. పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెకింగ్ నుంచి పెన్షన్, పన్ను చెల్లింపుల వరకు అన్ని పనులూ ఒక్క క్లిక్‌తో పూర్తవుతుండటంతో కోట్ల మంది పౌరులు ఈ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు.

పేపర్‌లెస్ డిజిటల్ ఇండియా

ఉమాంగ్ యాప్‌తో పాటు దేశంలో డిజిలాకర్ వినియోగం కూడా అపారంగా పెరిగింది. దాదాపు 72.43 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లతో డిజిలాకర్ కొత్త శిఖరాలను తాకింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 5,437 రకాల అధికారిక పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 72.86 కోట్లకు పైగా సర్టిఫికేట్లు, డాక్యుమెంట్ల లావాదేవీలు డిజిలాకర్ ద్వారా జరిగాయి. సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, డిజిటల్ సంతకాలు, ఈ-సైన్ ద్వారా సులువుగా పనులు పూర్తవుతున్నాయి.

పల్లెపల్లెకూ డిజిటల్ వెలుగులు

గ్రామీణ, సుదూర ప్రాంతాల్లోని ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయిలో 4,07,122 కేంద్రాలు నిర్బంథంగా పనిచేస్తున్నాయి. వీటిలో విశేషమేమిటంటే దాదాపు 70,069 సెంటర్లను మహిళా గ్రామీణ స్థాయి పారిశ్రామికవేత్తలు (VLEs) విజయవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పింఛన్లు, బిల్లుల చెల్లింపులు గ్రామాల నుంచే క్షణాల్లో పూర్తవుతున్నాయి.

సామాన్యుడి చేతికి ల్యాప్‌టాప్, మొబైల్

జూలై 2015 లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా దార్శనికత నేడు ప్రతి పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. అనేక ప్రాంతీయ భాషల్లో సేవలు లభిస్తుండటంతో చదువురాని వారికి కూడా యాప్‌ల వాడకం సులభమైంది. ప్రధాని గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ (PMGDISHA) ద్వారా గ్రామీణులకు అవగాహన కల్పిస్తుండటంతో, క్యూలైన్లలో నిలబడే శ్రమ తప్పి కాలం, డబ్బు ఆదా అవుతున్నాయి.

Tags: