FDI : భారత బీమా రంగంలోకి కొరియన్ కంపెనీల ఎంట్రీ.. ఇన్సూరెన్స్‌లోనూ శామ్సంగ్, హ్యుందాయ్ హవా
ఇన్సూరెన్స్‌లోనూ శామ్సంగ్, హ్యుందాయ్ హవా
FDI : భారతదేశం అక్షరాలా 130 బిలియన్ డాలర్ల బీమా మార్కెట్‌కు నిలయం. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు అంతర్జాతీయ దిగ్గజాల కన్ను మన దేశంపై పడింది. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు భారత బీమా రంగంలోకి అడుగుపెట్టేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాయి. శామ్సంగ్, హ్యుందాయ్ వంటి బ్రాండ్లు ఇప్పటికే మన దేశంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో రాజ్యమేలుతుండగా, ఇప్పుడు బీమా వ్యాపారంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
భారత ప్రభుత్వం బీమా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులకు ఉన్న పరిమితులను ఎత్తేసి, 100 శాతం FDIకి అనుమతి ఇవ్వడం కొరియన్ కంపెనీలకు కలిసొచ్చింది. శామ్సంగ్ ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్, మిరే అసెట్ ఫైనాన్షియల్ గ్రూప్, హ్యుందాయ్ మెరైన్ అండ్ ఫైర్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు ఇప్పటికే భారత బీమా నియంత్రణ సంస్థతో పాటు మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నాయి. కొరియన్ కంపెనీలు నేరుగా రావాలా లేక స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్ పెట్టుకోవాలా అనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శామ్సంగ్ మరియు హ్యుందాయ్ మెరైన్ సంస్థలు ప్రధానంగా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ అంటే వాహన బీమా, ఆరోగ్య బీమా, ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌పై దృష్టి సారించాయి. హ్యుందాయ్ కార్లు ఇండియాలో పాపులర్ కాబట్టి, ఆ వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా తమ సంస్థ నుంచే ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే మన దేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ఉన్న మిరే అసెట్ గ్రూప్.. లైఫ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్లు, పెన్షన్ ఉత్పత్తులపై కన్నేసింది. కొరియన్ కంపెనీలు భారత బీమా రంగంలోకి నేరుగా ప్రవేశించడం ఇదే మొదటిసారి అవుతుంది.
భారతదేశంలో బీమా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. మన దేశ జీడీపీలో బీమా ప్రీమియం కేవలం 3.7 శాతం మాత్రమే ఉంది, ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. అయితే, భారత మార్కెట్లో ఏజెంట్లకు ఇవ్వాల్సిన కమిషన్లు ఎక్కువగా ఉండటం, లాభాల శాతం తక్కువగా ఉండటం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. మెకిన్సే నివేదిక ప్రకారం.. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఇన్సూరెన్స్ మార్జిన్లు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కొరియన్ కంపెనీలు భారత్‌ను ఒక బంగారు బాతులా భావిస్తున్నాయి.