ITR Filing : ఈసారి గడువు సెప్టెంబర్ 15 వరకే.. లేట్ చేస్తే భారీగా ఫైన్ కట్టాలి!
లేట్ చేస్తే భారీగా ఫైన్ కట్టాలి!
ITR Filing : ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) సమర్పించడానికి గడువు సమీపిస్తోంది. ఈసారి ఐటీఆర్ గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ గడువు కేవలం ఆడిటింగ్ అవసరం లేని వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఇప్పటివరకు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయండి. ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చాలా సులభంగా మారిపోయింది. కొన్ని క్లిక్‌లతో మీరే సొంతంగా ఐటీఆర్ సమర్పించవచ్చు.
ఏ ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయాలి?
ప్రస్తుతం మనం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించాలి. అంటే, 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మీరు సంపాదించిన ఆదాయం మొత్తాన్ని లెక్కించి ఈ రిటర్న్స్‌లో చూపించాలి. ముఖ్యంగా, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి.
ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల లాభాలు..
మీ ఆదాయానికి చట్ట ప్రకారం పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, మీకు పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపులు, రాయితీలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికే టీడీఎస్ (TDS) రూపంలో పన్ను చెల్లించి ఉంటే, మీ మొత్తం ఆదాయం మినహాయింపు పరిమితిలో ఉంటే, మీరు ఇప్పటికే చెల్లించిన పన్ను మొత్తాన్ని తిరిగి పొందడానికి ఐటీఆర్ ఫైల్ చేయడమే ఏకైక మార్గం. అలాగే, భవిష్యత్తులో ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా, వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా ఇతర ఆర్థిక లావాదేవీల కోసం మీ ఆదాయానికి సంబంధించిన రుజువు అవసరం అవుతుంది. అటువంటి సందర్భాలలో ఐటీఆర్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతుంది.
గడువు దాటితే జరిమానా ఎంత?
ఒకవేళ మీరు గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, ఆర్థికంగా నష్టపోతారు. నిబంధనల ప్రకారం ఆలస్యంగా ఫైల్ చేస్తే రూ.5,000 జరిమానా విధించబడుతుంది. అయితే, మీ మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే జరిమానా కేవలం రూ.1,000 మాత్రమే ఉంటుంది. అంతేకాదు, మీరు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండి, ఆ పన్నును గడువులోగా చెల్లించకపోతే, ఆ మొత్తానికి ప్రతి నెలా 1% వడ్డీని కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.