Lenovo : 12.1 అంగుళాల డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో లెనోవో నుంచి కొత్త ట్యాబ్..ధర ఎంతంటే?
ధర ఎంతంటే?
Lenovo : లెనోవో తన కొత్త ప్రీమియం ట్యాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ ప్లస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఐడియా ట్యాబ్ సిరీస్‌లో అప్‌గ్రేడ్ మోడల్. ఈ ట్యాబ్‌లో పెద్ద డిస్‌ప్లే, పవర్ఫుల్ బ్యాటరీ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ ధర రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ (Wi-Fi, 5G ఆప్షన్లు అందుబాటులో) లభిస్తుంది. ఇక 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ గల Wi-Fi మోడల్ ధర రూ.30,999. ఈ ట్యాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 22 నుంచి లెనోవో వెబ్‌సైట్, అమెజాన్‌లో అమ్మకానికి వస్తుంది. ఇది లూనా గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.
లెనోవో ఐడియా ట్యాబ్ ప్లస్ ట్యాబ్‌లో 12.1 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 2.5K రెజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్‌నెస్ 800 నిట్స్ వరకు ఉండటం వలన వెలుతురులో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 12GB వరకు ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజ్‌తో జత చేయబడింది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది కొత్త ఆండ్రాయిడ్ 15 పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
లెనోవో ఈ ట్యాబ్‌లో 10,200mAh సామర్థ్యం గల పెద్ద లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చింది, ఇది 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇందులో Wi-Fi 802.11 a/b/g/n/ac సపోర్ట్, అలాగే 5G కనెక్టివిటీతో కూడిన LTE వేరియంట్ కూడా లభిస్తుంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్ బరువు సుమారు 540 గ్రాములు. అదనపు ఫీచర్లలో ఇందులో Lenovo NotePad, Circle to Search, Gemini AI ఫీచర్లు, Tab Pen స్టైలస్ సపోర్ట్ వంటివి ఉన్నాయి.