LPG Crisis : గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు.. గ్యాస్ లేకుండా వంట చేసే చిట్కాలు ఇవే
గ్యాస్ లేకుండా వంట చేసే చిట్కాలు ఇవే
LPG Crisis : పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణల వల్ల హోర్ముజ్ జలసంధి గుండా జరగాల్సిన చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీని ప్రభావంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా గ్యాస్ ధరల మంట మొదలైంది. ఇప్పటికే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 వరకు భారం పడింది. ఒకవేళ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ లేకపోయినా వంటింట్లో పొయ్యి వెలిగేలా చేసే అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
వంటింట్లో స్మార్ట్ ఛాయిస్ ఇండక్షన్ స్టవ్
గ్యాస్ కొరతను అధిగమించడానికి అత్యంత సులభమైన మార్గం ఇండక్షన్ స్టవ్. ఇది పూర్తిగా విద్యుత్తుతో నడుస్తుంది కాబట్టి గ్యాస్ అవసరం ఉండదు. గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే ఇది చాలా వేగంగా వంట పూర్తి చేస్తుంది. ఇందులో మంట రాదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువ. టీ, పప్పు, అన్నం ఇలా రోజూ మనం చేసుకునే వంటలన్నీ ఇందులో చిటికెలో అయిపోతాయి. దీని కోసం వాడే ఇండక్షన్ బేస్ గిన్నెలు ఇప్పుడు మార్కెట్‌లో చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. మధ్యతరగతి ఇళ్లకు ఇదొక బెస్ట్ బ్యాకప్ ఆప్షన్.
మైక్రోవేవ్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్
చాలామంది మైక్రోవేవ్ ఓవెన్‌ను కేవలం వంటలు వేడి చేసుకోవడానికే వాడుతుంటారు. కానీ ఇందులో కూరలు, పాస్తా, కేకులు వంటివి కూడా వండవచ్చు. ఇక బ్యాచిలర్లకు లేదా చిన్న కుటుంబాలకు ఎలక్ట్రిక్ కెటిల్ ఒక వరప్రసాదం. కేవలం నీళ్లు మరిగించడానికే కాకుండా, ఇందులో నూడుల్స్, సూప్, ఉడకబెట్టిన గుడ్లు వంటివి సులభంగా తయారు చేసుకోవచ్చు. సుమారు రూ.500 నుంచే కెటిల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు గ్యాస్ కష్టాలను ఇవి దరిచేరనీయవు.
ఎయిర్ ఫ్రైయర్, ఫుడ్ స్టీమర్
ఈ రోజుల్లో హెల్తీ కుకింగ్ వైపు మొగ్గు చూపే వారికి ఎయిర్ ఫ్రైయర్ మంచి ఆప్షన్. నూనె లేకుండా సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, కట్లెట్స్ వంటివి ఇందులో వండుకోవచ్చు. దీనికి గ్యాస్ అవసరం లేదు, వంట కూడా త్వరగా అవుతుంది. ఇక రూ.1000 లోపు దొరికే ఫుడ్ స్టీమర్లు కూడా చాలా ఉపయోగకరం. ఇడ్లీ, మోమోస్, దోక్లా వంటివి ఆవిరిపై వండుకోవడానికి ఇవి చక్కగా పనిచేస్తాయి. వీటివల్ల ఆహారంలోని పోషకాలు కూడా పోవు.
సాంప్రదాయ పద్ధతులు
ఒకవేళ కరెంటు కూడా లేని పరిస్థితులు తలెత్తితే, మన పాత కాలపు పద్ధతులే ఆదుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వాడే కట్టెల పొయ్యి లేదా పిడకల పొయ్యి అత్యవసర సమయాల్లో ప్రాణధారగా మారుతాయి. పట్టణాల్లో ఉండేవారు బొగ్గులతో నడిచే సిగిడిని వాడవచ్చు. వీటిని గాలి తగిలే చోట లేదా బాల్కనీల్లో పెట్టుకుని వంట చేసుకోవచ్చు. కిరోసిన్ స్టవ్ కూడా ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయమే. అయితే వీటిని వాడేటప్పుడు పొగ రాకుండా, మంట ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరిగినా, సరఫరా ఆగినా ముందే ఇలాంటి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంటే వంటింట్లో కష్టాలు ఉండవు.