LPG Storage : ఇంట్లో గ్యాస్ సిలిండర్లు నిల్వ చేస్తున్నారా? ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్.. జాగ్రత్త

ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్.. జాగ్రత్త

Update: 2026-03-16 09:10 GMT

LPG Storage : పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుండటంతో మన దేశంలో వంట గ్యాస్ దొరకదేమోనన్న భయం చాలా మందిని వెంటాడుతోంది. ఈ ఆందోళనతో కొందరు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ, ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు నిల్వ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇలా అవసరానికి మించి సిలిండర్లను పోగేయడం కేవలం ప్రమాదకరం మాత్రమే కాదు, చట్టరీత్యా పెద్ద నేరం కూడా. కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు గ్యాస్ కనెక్షన్ల విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ రూల్స్ అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఒకే ఇల్లు.. ఒకే కనెక్షన్.. ఇదే రూల్

మన దేశంలో అమలవుతున్న ప్రధాన నిబంధన వన్ హౌస్ - వన్ కనెక్షన్. అంటే, ఒక చిరునామాపై లేదా ఒక వంటగది ఉన్న ఇంటికి ఒకే ఎల్‌పీజీ కనెక్షన్ ఉండాలి. ప్రస్తుతం దేశంలో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వంటి కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. ఒక వ్యక్తికి ఒక కంపెనీలో కనెక్షన్ ఉండి, అదే అడ్రస్‌పై మరో కంపెనీ నుంచి కనెక్షన్ తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఒకవేళ మీకు అదనపు సిలిండర్ కావాలనుకుంటే, మీ పాత కనెక్షన్‌నే డబుల్ సిలిండర్ కనెక్షన్ కింద మార్చుకోవచ్చు. దీనివల్ల ఒకే కనెక్షన్‌పై రెండు సిలిండర్లు కలిగి ఉండే చట్టబద్ధమైన అవకాశం లభిస్తుంది.

చట్టప్రకారం ఇంట్లో ఎన్ని సిలిండర్లు ఉండవచ్చు?

సాధారణంగా ఒక గృహ వినియోగదారుడు తన కనెక్షన్‌పై రెండు సిలిండర్లు ఉంచుకోవడం చట్టబద్ధం. ఒకటి వాడుకలో ఉంటే, రెండోది రిజర్వ్‌గా పెట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఒక వినియోగదారుడు ఏడాదికి గరిష్టంగా 15 సిలిండర్లను పొందే వీలుంది. అయితే, సరైన అనుమతి లేకుండా ఎవరైనా 40 కిలోల కంటే ఎక్కువ గ్యాస్‌ను (సుమారు 3 గృహ సిలిండర్లు) నిల్వ చేస్తే దానిని అక్రమ నిల్వగా పరిగణిస్తారు. యుద్ధం వస్తుందని లేదా ధరలు పెరుగుతాయని ఎక్కువ సిలిండర్లు దాచిపెడితే అధికారుల తనిఖీల్లో దొరికిపోతే కఠిన చర్యలు తీసుకుంటారు.

జైలు శిక్ష తప్పదు జాగ్రత్త

అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా బ్లాక్ మార్కెట్ చేయడం వంటి పనులకు పాల్పడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్రమ నిల్వలు బయటపడితే గ్యాస్ కనెక్షన్‌ను తక్షణమే రద్దు చేస్తారు. అంతటితో ఆగకుండా భారీ జరిమానా కూడా విధిస్తారు. ఇది అత్యవసర వస్తువుల చట్టం కింద నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 3 నెలల నుండి ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

భద్రతా నియమాలు మర్చిపోవద్దు

సిలిండర్లను నిల్వ చేసేటప్పుడు భద్రత అనేది అత్యంత ముఖ్యం. సిలిండర్లను ఎప్పుడూ గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో నిలబెట్టి ఉంచాలి. రెండు సిలిండర్లు ఉన్నప్పుడు ఒకదానిపై ఒకటి పెట్టడం ప్రమాదకరం. ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత లేదని, సరఫరా సజావుగానే సాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ప్రజలు అనవసరంగా ప్యానిక్ బుకింగ్స్ చేసి సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెంచవద్దని చమురు సంస్థలు కోరుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ అవసరానికి సరిపడా గ్యాస్ మాత్రమే బుక్ చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది కలగదు.

Tags:    

Similar News