SIP : నెలకు రూ.2,000 పొదుపు చేయండి..లక్షల రూపాయల నిధిని సొంతం చేసుకోండి
లక్షల రూపాయల నిధిని సొంతం చేసుకోండి
SIP : డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేసి భవిష్యత్తు కోసం కోట్లు గడించడం మరొక ఎత్తు. చాలా మంది "నా దగ్గర లక్షలు లేవు.. నేను ఎలా పెట్టుబడి పెట్టాలి?" అని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు. కానీ, నెలకు కేవలం 2,000 రూపాయలతో కూడా మీరు లక్షాధికారి కావచ్చని మీకు తెలుసా? మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా చిన్న మొత్తంతో పెద్ద నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో ఈ లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి భారీ మొత్తంలో డబ్బు ఉండాలనేది ఒక అపోహ మాత్రమే. నెలకు కేవలం రూ.2,000 తో కూడా మీరు ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రతి నెలా రూ.2,000 ఎస్ఐపీ చేస్తూ, దానిని పదేళ్ల పాటు కొనసాగించారనుకుందాం. వార్షికంగా సగటున 12 శాతం రిటర్న్స్ వచ్చినా, పదేళ్ల తర్వాత మీ చేతికి సుమారు రూ.4,65,000 అందుతాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పదేళ్లలో మీరు మీ జేబు నుంచి కట్టిన అసలు కేవలం రూ.2,40,000 మాత్రమే. మిగిలిన రూ.2,25,000 కేవలం లాభం రూపంలోనే మీకు లభిస్తుంది. కాంపౌండింగ్ పవర్ వల్ల మీ డబ్బు ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ.
చాలా మందికి షేర్ మార్కెట్ అంటే భయం. మార్కెట్ పడిపోతే తమ డబ్బులు పోతాయని ఆందోళన పడుతుంటారు. అలాంటి వారి కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో మీ డబ్బును నేరుగా షేర్లలో కాకుండా.. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్స్ వంటి సురక్షితమైన చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఒక రకంగా ప్రభుత్వం లేదా పెద్ద కంపెనీలకు మనం అప్పు ఇవ్వడం లాంటిది. వారు నిర్ణీత కాలం తర్వాత మన అసలుతో పాటు వడ్డీని కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే ఇందులో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.
చాలా కాలంగా మధ్యతరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్ పైనే ఆధారపడేవారు. అయితే ప్రస్తుత కాలంలో ఎఫ్ డీ లపై వచ్చే వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్థాయిలో లేవు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్‌డీల కంటే మెరుగైన రిటర్న్స్ ఇస్తూనే, షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది చాలా లాభదాయకం. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోగలము అనుకుంటే, ఇండెక్స్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్ వైపు కూడా చూడవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం లేదా సదరు ఫండ్ గురించి పూర్తిగా అధ్యయనం చేయడం ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు అనే అంశాలను బట్టి సరైన ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడిని మొదలుపెడితే, కాంపౌండింగ్ ద్వారా అంత పెద్ద మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.