New Rules : గోల్డ్ లోన్ నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు.. నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే

నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే

Update: 2025-10-01 02:24 GMT

New Rules : భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 1, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలలో మార్పులు తీసుకువస్తోంది. ఈ మార్పులు సామాన్యుల నుంచి వ్యాపార సంస్థల వరకు అందరిపై ప్రభావం చూపుతాయి. గోల్డ్ లోన్‌లు, బ్యాంక్ వడ్డీ రేట్లు, చెక్ క్లియరింగ్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్ వంటి పలు అంశాలలో ఈ కొత్త నియమాలు అమలవుతాయి.

1. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు, కస్టమర్‌లకు ఎక్కువ స్వేచ్ఛ

ఫ్లోటింగ్ రేట్ లోన్‌లు : ఇప్పటివరకు ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల విషయంలో మూడు సంవత్సరాల వరకు వడ్డీ రేట్లను మార్చడానికి వీలుండేది కాదు. కానీ, ఆర్‌బీఐ ఇప్పుడు ఈ నియమాన్ని సడలించింది. దీని ప్రకారం బ్యాంకులు మూడు సంవత్సరాల కంటే ముందే ఫ్లోటింగ్ రేట్లను నిర్ణయించడానికి స్వతంత్రంగా ఉంటాయి. అలాగే, కస్టమర్‌లు కోరుకుంటే ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ నుంచి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ కు మారే అవకాశం ఉండాలని ఆర్‌బీఐ కొత్త నియమం సూచిస్తోంది. ఇది రుణ గ్రహీతలకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.

2. బంగారం, వెండి తనఖా రుణాలు:

నగలకు రుణాలు: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఆభరణాల వ్యాపారులకు బంగారం, వెండి నగలపై రుణాలు ఇచ్చే నియమాలలో సవరణలు తీసుకువచ్చింది.

3. నిరంతర చెక్ క్లియరింగ్:

వేగవంతమైన క్లియరింగ్: అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరింగ్ సిస్టమ్‌లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం చెక్కులు బ్యాచ్‌ల వారీగా క్లియర్ అవుతాయి, దీనివల్ల డబ్బు ఖాతాలో జమ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొత్త నియమం ప్రకారం, నిరంతర చెక్ క్లియరెన్స్ సిస్టమ్‎ను తీసుకువస్తున్నారు. దీనివల్ల చెక్కులు వేగంగా క్లియర్ అయ్యి, డబ్బు త్వరగా కస్టమర్ల ఖాతాలో జమ అవుతుంది.

4. గోల్డ్ మెటల్ లోన్ :

తిరిగి చెల్లించే వ్యవధి: బ్యాంకులు ఆభరణాల వ్యాపారులకు బంగారాన్నే రుణం (గోల్డ్ మెటల్ లోన్)గా ఇస్తాయి. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి గతంలో 180 రోజుల సమయం ఉండేది. ఆర్‌బీఐ ఇప్పుడు ఈ తిరిగి చెల్లించే వ్యవధిని 270 రోజులకు పెంచింది. ఇది వ్యాపారులకు మరింత ఊరటనిస్తుంది.

5. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్:

ఖచ్చితమైన రిపోర్టింగ్: కస్టమర్ల తాజా క్రెడిట్ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేలా వారపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ సిస్టమ్ను తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీనివల్ల కస్టమర్ల క్రెడిట్ స్కోర్, రిపోర్ట్ మరింత ఖచ్చితంగా ఉంటుంది. ఇది రుణాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది.

6. భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్:

ఆధార్ తప్పనిసరి: ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అనే నిబంధనను IRCTC తీసుకువస్తోంది. ఏజెంట్లు టికెట్ బుకింగ్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేయకుండా అరికట్టడానికి ఐఆర్‌సీటీసీ ఈ చర్య తీసుకుంది. దీనివల్ల టికెట్ల లభ్యతలో పారదర్శకత పెరుగుతుంది. ఈ కొత్త ఆర్థిక నియమాలు అక్టోబర్ 1 నుంచి అమలవుతాయి.

Tags:    

Similar News