Microfinance Loans : సామాన్యులకు అదిరిపోయే ఛాన్స్..తాకట్టు లేకుండానే రూ.1.25 లక్షల వరకు లోన్
తాకట్టు లేకుండానే రూ.1.25 లక్షల వరకు లోన్
Microfinance Loans : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, స్వయం ఉపాధి పొందే మహిళలకు అండగా నిలిచే అద్భుతమైన మార్గం మైక్రోఫైనాన్స్ రుణాలు. సాధారణంగా బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు పొందలేని సామాన్యుల కోసం వీటిని రూపొందించారు. ఎటువంటి పూచీకత్తు లేదా ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఏడాదికి రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా లేదా అత్యవసర వైద్య ఖర్చులకైనా ఈ రుణాలు ఎంతో ఆసరాగా నిలుస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. మైక్రోఫైనాన్స్ లోన్ అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇచ్చే చేయూత. ఒకవేళ రుణం ఇచ్చేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఆస్తి పత్రాలు లేదా బంగారం అడిగితే అది మైక్రోఫైనాన్స్ కిందకు రాదు. ఈ రుణాలను వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, విద్యా అవసరాలు, వినియోగ వస్తువుల కొనుగోలు కోసం వాడుకోవచ్చు. ఇవి కేవలం అప్పులు మాత్రమే కాదు, పేదరికం నుంచి బయటపడేందుకు ఒక ఆర్థిక నిచ్చెన వంటివి.
ఈ రుణాల పరిమితి విషయానికి వస్తే.. సాధారణంగా రూ.10,000 నుంచి రూ.1.25 లక్షల వరకు లభిస్తాయి. వీటిని తిరిగి చెల్లించేందుకు ఒకటి నుంచి మూడు ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. మీకు అనుకూలమైన పద్ధతిలో అంటే వారానికోసారి, పదిహేను రోజులకోసారి లేదా నెలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మరో గొప్ప వెసులుబాటు ఏమిటంటే.. మీరు అనుకున్న సమయం కంటే ముందే లోన్ క్లియర్ చేయాలనుకుంటే, ఎటువంటి అదనపు ఛార్జీలు కట్టాల్సిన పనిలేదు. అయితే మీరు కట్టే నెలవారీ వాయిదా మీ కుటుంబ మొత్తం ఆదాయంలో 50 శాతం మించకుండా ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
వడ్డీ రేట్ల విషయానికి వస్తే, వీటికి ఒక నిర్ణీత పరిమితి లేకపోయినప్పటికీ, బ్యాంకులు లేదా సంస్థలు ఇష్టారాజ్యంగా వసూలు చేయడానికి వీల్లేదు. సంస్థ బోర్డు ఆమోదించిన పాలసీ ప్రకారం పారదర్శకంగా ఉండాలి. ఈ రుణాలను కేవలం ఆర్‌బీఐ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఇవ్వాలి. వాటిలో కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, స్వయం సహాయక సంఘాలు ప్రధానమైనవి. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బంది పడకుండా, ఇలాంటి గుర్తింపు పొందిన సంస్థలను ఆశ్రయించడం శ్రేయస్కరం.