Middle East Crisis : పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ, భారత ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నా.. మన దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, మందుల ధరలపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం గట్టి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తూ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది.

మందుల ధరలు నియంత్రణలో ఆందోళన వద్దు

అంతర్జాతీయంగా ఏవైనా గొడవలు మొదలవగానే ముందుగా పెరిగేవి మందుల ధరలు. కానీ, భారత్ ముందుగానే అప్రమత్తమై మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంది. దీనివల్ల దేశీయంగా ప్రాణరక్షణ మందుల ధరలు పెరగలేదు. విదేశాల్లో సంక్షోభం ఉన్నప్పటికీ, సామాన్యుడికి అందుబాటు ధరలోనే వైద్యం అందుతోంది. ఔషధ కంపెనీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ స్టాక్ నిల్వలను పర్యవేక్షిస్తోంది.

గ్యాస్ సరఫరాలో రికార్డ్

మధ్య ప్రాచ్యం నుంచి భారత్ ప్రధానంగా చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల గ్యాస్ కొరత వస్తుందని భయపడ్డ వారికి ప్రభుత్వం లెక్కలతో సహా సమాధానం ఇచ్చింది. డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (DAC)ని కఠినంగా అమలు చేయడం వల్ల గ్యాస్ పంపిణీలో అక్రమాలకు తావులేకుండా పోయింది. దీనివల్ల అధికారిక గణాంకాలు 92% వృద్ధి చెందాయి. ఫిబ్రవరి 2026లో రోజుకు 77 వేల సిలిండర్లు అమ్ముడవగా, నిన్న ఆ సంఖ్య 1.06 లక్షలు దాటింది. పైపుడ్ గ్యాస్ వినియోగం కూడా విపరీతంగా పెరిగింది, సుమారు 18 వేల మంది పాత ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకుని పీఎన్‌జీ వైపు మొగ్గు చూపారు.

సముద్ర మార్గంలో విజయం

భారత జెండాతో ఉన్న ఎల్‌పీజీ నౌక గ్రీన్ ఆశ ఏప్రిల్ 5న అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని దాటి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT)కు సురక్షితంగా చేరుకుంది. యుద్ధ వాతావరణంలో కూడా భారత నౌకలు ధైర్యంగా సముద్ర ప్రయాణం చేయడం మన దేశం యొక్క సత్తాను చాటిచెప్పింది. ఇది దేశంలో ఇంధన భద్రతకు సంబంధించి ప్రజల్లో ఉన్న భయాలను తొలగించింది. మన ఇళ్లలో వంట గ్యాస్ సరఫరాకు ఎటువంటి బ్రేక్ పడదని ఇది నిరూపించింది.

భారతీయుల తరలింపు, దౌత్య వ్యూహం

కేవలం ధరలే కాదు, విదేశాల్లో ఉన్న మన వారి ప్రాణాలు కూడా ముఖ్యమని ప్రభుత్వం నిరూపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి విద్యార్థులు, మత్స్యకారులు సహా మొత్తం 2,170 మంది భారతీయులను సురక్షితంగా ఆర్మేనియా, అజర్బైజాన్ సరిహద్దుల గుండా రోడ్డు మార్గంలో భారత్‌కు తరలించారు. మరోవైపు, విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో యూఏఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన ద్వారా గల్ఫ్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచి, సంక్షోభ సమయాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోనున్నారు.

Tags: