Pharma Industry : సామాన్యుడికి షాక్.. దేశంలో పెరగనున్న మందుల ధరలు

దేశంలో పెరగనున్న మందుల ధరలు

Update: 2025-11-22 06:11 GMT

Pharma Industry : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం కారణంగా దేశంలో త్వరలో మందుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ తయారీలో ఉపయోగించే ముడిసరుకు (ఫార్మాస్యూటికల్ ఇన్‌పుట్) కోసం ప్రభుత్వం మినిమం ఇంపోర్ట్ ప్రైస్, అంటే కనీస దిగుమతి ధరను నిర్ణయించాలని నిర్ణయించింది. దీనిపై ఫార్మా ఇండస్ట్రీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన ముడిసరుకులపై మినిమం ఇంపోర్ట్ ప్రైస్, విధించడం వల్ల యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియంట్, మందులు తయారుచేసే కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, ఆ భారం నేరుగా రోగులపై పడి మందుల ధరలు పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం చైనా వంటి దేశాల నుంచి జరుగుతున్న ముడిసరుకు భారీ దిగుమతిని తగ్గించడమే. అతి తక్కువ ధరలకు ముడిసరుకు దిగుమతి కావడం వల్ల భారతదేశంలోని దేశీయ ఉత్పత్తిదారుల మనుగడపై ప్రభావం పడుతుందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, పలు వైద్య నిపుణులు ఈ చర్య భారత ఫార్మా రంగానికి నష్టదాయకమని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పెన్సిలిన్-జీ, 6ఏపీఏ, అమాక్సిసిలిన్ వంటి ముఖ్యమైన యాంటీబయాటిక్స్‌లో ఉపయోగించే పదార్థాలపై మినిమం ఇంపోర్ట్ ప్రైస్ నిర్ణయించేందుకు యోచిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖ్యంగా యాంటీబయాటిక్ మందుల్లో ఉపయోగించే ఈ ముడిసరుకులపై మినిమం ఇంపోర్ట్ ప్రైస్ విధించడం వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం వల్ల 10,000 కంటే ఎక్కువ MSME యూనిట్లు ప్రభావితం కావొచ్చు, వీటిలో చాలా వరకు మూతపడే ప్రమాదం ఉంది. దీని ఫలితంగా, సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. గతంలో సెప్టెంబర్‌లో ATS-8 దిగుమతికి సెప్టెంబర్ 30, 2026 వరకు కనీస ధరను కిలోకు $111 డాలర్లుగా నిర్ణయించారు. దీని తర్వాత సల్ఫాడయాజీన్‌కు కూడా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు కిలోకు రూ.1,174 మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ను ప్రభుత్వం ప్రకటించింది.

కొంతమంది నిపుణులు ఈ చర్యను ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక బలమైన సంకేతంగా చూస్తున్నారు. ఎందుకంటే భారత ఫార్మా పరిశ్రమ ముడిసరుకు కోసం అధికంగా చైనాపై ఆధారపడి ఉంది. 2020లో ఈ ఆధారితాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దేశీయ కంపెనీలు ముడిసరుకు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సాహకాలు అందించారు.

అయితే, 6APA లేదా అమాక్సిసిలిన్ ధరలను నియంత్రించడానికి ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఉద్దేశించబడలేదని పరిశ్రమ అధికారులు అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని ఉపయోగించినట్లయితే, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పొందుతున్న కంపెనీలు పథకం పరిధికి వెలుపల కూడా అదనపు రక్షణ లేదా ప్రయోజనాలను ఆశిస్తున్నాయనే సందేశం మార్కెట్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News