Stock Market : ఏప్రిల్ 1న ట్రేడర్లకు ఏప్రిల్ ఫూల్.. ట్యాక్స్ లతో ఉక్కుపాశం బిగించిన ప్రభుత్వం
ట్యాక్స్ లతో ఉక్కుపాశం బిగించిన ప్రభుత్వం
Stock Market : షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి, ముఖ్యంగా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాడ్ న్యూస్ అందనుంది. దేశంలో పెరుగుతున్న స్పెక్యులేషన్ (ఊహాజనిత ట్రేడింగ్)ను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన నిర్ణయాలు బుధవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. దీనివల్ల డెరివేటివ్స్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన 2026-27 బడ్జెట్‌లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ను భారీగా పెంచింది. ఇప్పటివరకు ఫ్యూచర్స్‌పై 0.02 శాతంగా ఉన్న ట్యాక్స్‌ను ఏకంగా 0.05 శాతానికి పెంచారు. అంటే ఇది 150 శాతం పెరుగుదల. ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే, ప్రీమియం, ఎక్సర్‌సైజ్ రెండింటిపై కూడా పన్ను పెరిగింది. పాత రేట్లు 0.10%, 0.125% నుంచి పెరిగి 0.15 శాతానికి చేరనున్నాయి. మీరు లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా ట్రేడ్ చేసిన వెంటనే బ్రోకర్లు ఈ పన్నును వసూలు చేస్తారు కాబట్టి, ట్రేడర్ల ప్రాథమిక పెట్టుబడిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.
ఆర్బీఐ అప్పుల నిబంధనలు కఠినం
కేవలం పన్నులే కాకుండా, రిజర్వ్ బ్యాంక్ కూడా బ్రోకర్ల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది. బుధవారం నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. బ్రోకర్లకు బ్యాంకుల నుంచి లభించే క్రెడిట్ సదుపాయాలకు 100% గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల బ్రోకర్లకు మూలధన ఖర్చు పెరుగుతుంది. గతంలో బ్యాంకుల నుంచి సులభంగా అప్పులు తీసుకుని ట్రేడింగ్ వాల్యూమ్ పెంచే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. దీనివల్ల మార్కెట్లోకి వచ్చే నగదు ప్రవాహం తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్న ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్, ఆనంద్ రాఠీ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ ప్రకారం.. ఈ మార్పుల వల్ల రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం సుమారు 20 నుంచి 30 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆప్షన్స్ కంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వారు ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే ఫ్యూచర్స్ ట్యాక్స్ అనేది మొత్తం ట్రాన్సాక్షన్ విలువపై లెక్కిస్తారు. దీనివల్ల హెడ్జింగ్, ఆర్బిట్రేజ్ కార్యకలాపాలు చేసే వారికి ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది?
సాధారణ ఇన్వెస్టర్లు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నారని గతంలోనే సెబీ నివేదికలు వెల్లడించాయి. అతిగా స్పెక్యులేషన్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరంగా మారుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అడ్డూఅదుపు లేకుండా ట్రేడింగ్ చేసే వారిని నిరుత్సాహపరచడానికి, మార్కెట్లో గ్యాంబ్లింగ్ లాంటి ధోరణిని తగ్గించడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి ట్రేడ్ చేసేటప్పుడు ప్రతి పైసా లెక్కచూసుకోవడం ఇన్వెస్టర్లకు చాలా అవసరం.