NPS : ఒక్కసారి డబ్బు కడితే 85 ఏళ్ల వరకు ఛాన్స్..ఎన్‌పీఎస్‌లో పెట్టిన ప్రతి రూపాయి ఇప్పుడు బంగారం

ఎన్‌పీఎస్‌లో పెట్టిన ప్రతి రూపాయి ఇప్పుడు బంగారం

Update: 2025-12-20 06:46 GMT

NPS : రిటైర్మెంట్ తర్వాత ఎవరి ముందూ చేయి చాచకుండా, గౌరవంగా బతకాలనుకునే వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒక వరం లాంటిది. ప్రస్తుతం దేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి అవగాహన పెరుగుతున్నా, ఇప్పటికీ కేవలం 2 శాతం లోపు జనాభా మాత్రమే ఎన్‌పీఎస్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ నిబంధనల్లో కొన్ని విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పుడు ఈ పథకం కేవలం పెన్షన్ కోసమే కాదు, భారీ మొత్తంలో సొమ్ము వెనకేయడానికి కూడా ఒక అద్భుతమైన మార్గంగా మారింది.

ఎన్‌పీఎస్‌ను అందరూ ఇష్టపడటానికి ప్రధాన కారణం దీని తక్కువ ఖర్చు. మార్కెట్లో దొరికే ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌తో పోలిస్తే ఎన్‌పీఎస్ చాలా చౌకైనది. కేవలం ఏడాదికి 1,000 రూపాయల నుంచి కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. రిటర్న్స్ విషయంలో కూడా ఇది మ్యూచువల్ ఫండ్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత మూడేళ్ల గణాంకాలను చూస్తే, ఎన్‌పీఎస్ ఈక్విటీ ఫండ్లు సగటున 12.5 నుంచి 16.5 శాతం వరకు వార్షిక లాభాలను అందించాయి. పదేళ్ల కాల వ్యవధిలో కూడా 14 శాతం పైగా రిటర్న్స్ రావడం విశేషం.

గతంలో ఎన్‌పీఎస్ నుంచి డబ్బులు తీసుకోవడం చాలా కష్టమనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. మునుపు మెచ్యూరిటీ తర్వాత 40 శాతం డబ్బుతో కచ్చితంగా యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) కొనాలనే నిబంధన ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం, మీ ఎన్‌పీఎస్ ఫండ్ 8 లక్షల రూపాయల లోపు ఉంటే, ఒక్క రూపాయి కూడా యాన్యుటీలో పెట్టకుండా మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే, 80 శాతం వరకు నగదు తీసుకోవచ్చు, కేవలం 20 శాతం మాత్రమే పెన్షన్ ప్లాన్‌లో ఉంచితే సరిపోతుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తం చేతిలో ఉండాలనుకునే వారికి చాలా ఊరటనిచ్చే విషయం.

పెట్టుబడి పెట్టే వయస్సు విషయంలో కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిని 85 ఏళ్ల వరకు కొనసాగించే అవకాశం ఉంది. అంటే మీ డబ్బుపై చక్రవడ్డీ మ్యాజిక్ పని చేయడానికి మరో 10 ఏళ్ల అదనపు సమయం దొరికినట్లే. కనీసం 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని భారీ నిధిని కూడబెట్టవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు, సురక్షితమైన భవిష్యత్తును అందించే ఈ పథకం ప్రతి ఉద్యోగికి, సామాన్యుడికి నిజంగానే సంజీవని లాంటిది.

Tags:    

Similar News