Delivery Boys: దేశంలో రోజూ కష్టపడే లక్షలాది మంది గిగ్ వర్కర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 కింద ఓలా, ఉబెర్, జొమాటో వంటి అగ్రిగేటర్ సంస్థలు తమ వర్కర్ల కోసం ప్రత్యేక భద్రతా నిధికి చందా చెల్లించేలా కొత్త నిబంధనలను త్వరలో ఖరారు చేయనుంది. ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు కష్టపడే క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లు, డెలివరీ బాయ్స్ సంక్షేమం కోసం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి సామాజిక భద్రత లేని ఈ గిగ్ వర్కర్లకు బీమా, ఆరోగ్య భద్రత, పింఛను వంటి ప్రయోజనాలు కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అగ్రిగేటర్ కంపెనీలు తమ ఆదాయం లేదా వర్కర్లకు చేసే చెల్లింపుల ఆధారంగా ఈ నిధికి విరాళం ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీనివల్ల నిరంతరం రోడ్లపై తిరిగే వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.

రెండు రకాల ఫార్ములాలపై విశ్లేషణ

సామాజిక భద్రతా నిధికి అగ్రిగేటర్ల విరాళాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మొదటిది, కంపెనీల వార్షిక టర్నోవర్ ఆధారంగా చందాను నిర్ణయించడం. రెండవది, ప్రతి లావాదేవీ లేదా కార్మికులకు చేసే మొత్తం చెల్లింపుల ఆధారంగా ఫండ్‌ను సేకరించడం. ఈ రెండు విధానాలు వేర్వేరు వ్యాపార నమూనాలపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా తక్కువ చార్జీలతో ఎక్కువ సంఖ్యలో రైడ్‌లు అందించే క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలపై చెల్లింపుల ఆధారిత మోడల్ ఎక్కువ ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది?

సామాజిక భద్రతా కోడ్ 2020 లోని సెక్షన్ 114(4) ప్రకారం అగ్రిగేటర్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1 శాతం నుంచి 2 శాతం వరకు సొమ్మును ఈ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం కార్మికులకు చేసే మొత్తం చెల్లింపుల్లో 5 శాతానికి మించకూడదు. మరో ప్రత్యామ్నాయంగా, నేరుగా వర్కర్లకు ఇచ్చే మొత్తం వేతనాల్లో 5 శాతం వరకు చందాగా వసూలు చేసే ఆలోచనను కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఏదేమైనా ప్రతి సంవత్సరం కంపెనీలు ఈ నిధిని కచ్చితంగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు పొందడానికి అర్హతలు

ఈ సామాజిక భద్రతా పథకం కింద ప్రయోజనాలు పొందడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలను నిర్ణయించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఒకే అగ్రిగేటర్ సంస్థ వద్ద కనీసం 90 రోజులు పనిచేసి ఉండాలి. లేదా వేర్వేరు అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి మొత్తం 120 రోజులు పనిచేసినా ఈ పథకానికి అర్హత సాధిస్తారు. రోజువారీ కష్ట జీవులుగా బతుకుతున్న గిగ్ వర్కర్లకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వడమే కాకుండా వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనుంది.

Tags: