Natural Gas: సముద్ర గర్భం నుంచి చౌకగా గ్యాస్ వెలికితీత.. ఓఎన్జీసీ, రిలయన్స్, బీపీ బిగ్ ప్రాజెక్ట్
ఓఎన్జీసీ, రిలయన్స్, బీపీ బిగ్ ప్రాజెక్ట్
Natural Gas: దేశంలో సహజ వాయువు ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు వెలికితీత వ్యయాన్ని తగ్గించడానికి ఒక భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ చొరవతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), బ్రిటిష్ చమురు దిగ్గజం బీపీ కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒడిశా తీరంలోని మహానది బేసిన్ లోతైన సముద్ర గర్భం నుంచి చౌకగా గ్యాస్ వెలికితీయడానికి 1 బిలియన్ డాలర్లతో (సుమారు రూ.8,300 కోట్లు) ఉమ్మడి మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమ్మడి మౌలిక వసతుల కేంద్రం ఏర్పాటు ఎందుకు?
సముద్రం లోపల అత్యంత లోతైన ప్రాంతాల నుంచి సహజ వాయువు వెలికితీయడం చాలా వ్యయంతో కూడుకున్న ప్రక్రియ. ప్రతీ కంపెనీ విడివిడిగా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాల వ్యయం విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ ఉత్పత్తి లాభదాయకంగా ఉండదు. ఈ ఖర్చును తగ్గించేందుకు విదేశాల్లో సక్సెస్ అయిన కామన్ ప్లాంట్ విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. ఒకే ప్లాంట్‌ను అందరూ వినియోగించుకోవడం వల్ల చిన్న గ్యాస్ నిల్వల నుంచి కూడా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల వృధా ఖర్చులు తగ్గడంతో పాటు పనులు వేగవంతం అవుతాయి.
తేలియాడే ప్లాంటా లేదా శాశ్వత నిర్మాణమా?
మహానది బేసిన్లో నిర్మించబోయే ఈ జాయింట్ ప్లాంట్ ద్వారా సహజ వాయువుతో పాటు కొండెంసేట్ కూడా సేకరిస్తారు. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సముద్రంలో తేలియాడే ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్ అండ్ ఆఫ్‌లోడింగ్ (FPSO) యూనిట్ ఏర్పాటు చేయడం మొదటి ప్రతిపాదన కాగా, సముద్రంలో శాశ్వత స్థిర నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం రెండో ప్రతిపాదన. తేలియాడే ఎఫ్‌పీఎస్‌ఓ ప్లాంట్ అయితే ఇతర ప్రాంతాల నుంచి తయారుచేసి వెంటనే తీసుకురావడానికి వీలుంటుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది.
అంతర్జాతీయ నార్త్ సీ మోడల్ ఆధారంగా ప్రాజెక్ట్
ఈ విధానం విదేశాలలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యంగా యూరప్‌లోని నార్త్ సీ ప్రాంతంలో చమురు కంపెనీలు ఇదే తరహాలో ఉమ్మడి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని సఫలీకృతమయ్యాయి. ఈ అంతర్జాతీయ నమూనా ప్రకారం ప్రాజెక్ట్ భాగస్వామ్య కంపెనీలే కాకుండా ఇతర చిన్న గ్యాస్ ఉత్పత్తి కంపెనీలు కూడా నిర్ణీత రుసుము చెల్లించి ఈ మౌలిక సదుపాయాలను వాడుకోవచ్చు. దీనివల్ల సముద్రంలో లభించే చిన్న చిన్న గ్యాస్ నిక్షేపాలు కూడా వృధా కాకుండా ఉత్పత్తిలోకి వస్తాయి.
సాంకేతిక సలహాదారుల నియామకం.. త్వరలో అధికారిక ప్రకటన
ఈ భారీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి త్వరలోనే ఇంటర్నేషనల్ టెక్నికల్ కన్సల్టెంట్లను నియమించనున్నారు. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో తోడ్పడనుంది. ప్రస్తుతం ప్రారంభ చర్చల దశలో ఉన్న ఈ సంచలన ప్రాజెక్టుపై త్వరలోనే ఓఎన్జీసీ, రిలయన్స్ జాయింట్ వెంచర్ యాజమాన్యాలు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.