Pakistan Economic Crisis : లీటర్ పెట్రోల్ రూ.321.. డీజిల్ రూ.335.. దివాళా దిశగా పాకిస్థాన్?

డీజిల్ రూ.335.. దివాళా దిశగా పాకిస్థాన్?

Update: 2026-03-10 10:21 GMT

Pakistan Economic Crisis : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మరోసారి అతలాకుతలం అవుతోంది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, దిగుమతులపైనే ఆధారపడే పాకిస్థాన్ ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటి, సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడుతుండటంతో ఇస్లామాబాద్‌పై నెలవారీ చమురు దిగుమతి భారం విపరీతంగా పెరిగిపోతోంది.

నెలవారీ భారం 600 మిలియన్ డాలర్లు

పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ తాజాగా దేశ ప్రజలను హెచ్చరించారు. వెస్ట్ ఆసియాలో సంక్షోభం గనుక ఇలాగే కొనసాగితే, పాకిస్థాన్ చమురు దిగుమతి బిల్లు నెలకు ఏకంగా 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,000 కోట్లు) మేర పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, విదేశీ అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఇది మరణశాసనమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 118 డాలర్లకు చేరడం పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఐఎంఎఫ్ కాళ్ల బేరానికి ఇస్లామాబాద్:

ఆర్థిక ఒత్తిడి భరించలేక పాకిస్థాన్ ప్రభుత్వం మళ్లీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సహాయం కోరుతోంది. పెట్రోలియం లెవీ విషయంలో తమకు కాస్త ఊరటనివ్వాలని పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఐఎంఎఫ్‌ను వేడుకుంటున్నారు. మరోవైపు దేశంలో ఉన్న పరిమిత చమురు నిల్వలను పొదుపుగా వాడుకోవాలని, ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరా కూడా ఆగిపోతుందని, అప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ప్రభుత్వం భయపడుతోంది. దీని కోసం ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈలతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం పాక్ చర్చిస్తోంది.

సామాన్యుడిపై ధరల బాదుడు

అంతర్జాతీయ ధరల ప్రభావం పాక్ వినియోగదారులపై అప్పుడే మొదలైంది. మార్చి 7 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.321.17 కు, డీజిల్ ధర రూ.335.86 కు చేరింది. పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న వేళ, ఖర్చులు పెరిగే సమయంలో ఇలా ఇంధన ధరలు పెరగడం సామాన్య ప్రజలను రోడ్డున పడేసింది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి.

గత్యంతరం లేని స్థితిలో ప్రభుత్వం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ప్రజలను రక్షించే శక్తి తమకు లేదని పాకిస్థాన్ పాలకులు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. అంతర్జాతీయ ధరల భారాన్ని ప్రజలపై వేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ షరతులను పాటించాలంటే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. సొంతంగా ఇంధన వనరులు లేకపోవడం, ఫారెక్స్ నిల్వలు అడుగంటిపోవడంతో పాకిస్థాన్ ఇప్పుడు ఒక విషవలయంలో చిక్కుకుపోయింది.

Tags:    

Similar News