PAN-Aadhaar Linking : వాయిదా వేస్తే వాత తప్పదు..పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి కష్టాలే
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి కష్టాలే
PAN-Aadhaar Linking : కేంద్ర ప్రభుత్వం పాన్-ఆధార్ అనుసంధానానికి సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు లింక్ చేయని వారందరికీ డిసెంబర్ 31, 2025 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ గడువు ముగిసిన మరుసటి రోజు నుండే, అంటే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది. ఆదాయపు పన్ను శాఖలో పారదర్శకత కోసం, నకిలీ కార్డుల బెడదను వదిలించుకోవడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. గతంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ తీసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఒకసారి మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అయితే, మీ ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోతాయి. మీరు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయలేరు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం, కొత్త అకౌంట్ తెరవడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేయడం అసాధ్యం అవుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో కూడా మీ పాన్ కార్డు చెల్లదు. మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే, ప్రభుత్వం విధించే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనవసరంగా జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే గడువు లోపు ఈ పని పూర్తి చేయడం ఉత్తమం.
పాన్-ఆధార్ లింక్ చేయడం చాలా సులభం. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు, మీ మొబైల్‌లోనే పూర్తి చేయవచ్చు. ముందుగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) సందర్శించండి. అక్కడ హోమ్ పేజీలో క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేసి, మీ పేరును ధృవీకరించుకోండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే మీ లింకింగ్ అభ్యర్థన విజయవంతంగా పూర్తవుతుంది.
చాలామంది చివరి రోజు వరకు వేచి చూసి, అప్పుడు సర్వర్ పనిచేయడం లేదని లేదా వెబ్‌సైట్ స్లోగా ఉందని ఇబ్బంది పడుతుంటారు. గడువు ముగిసే సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే డిసెంబర్ 31 వరకు వేచి చూడకుండా ఇప్పుడే మీ స్టేటస్ చెక్ చేసుకుని లింక్ చేసుకోండి. దీనివల్ల మీ ఆర్థిక లావాదేవీలు ఆగిపోకుండా ఉండటమే కాకుండా, పెనాల్టీ భారం నుంచి కూడా మీరు సురక్షితంగా ఉండవచ్చు.