PF Money : ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మీ పాత పీఎఫ్ పైసలు ఇక చిటికెలో కొత్త అకౌంట్‌లోకి
మీ పాత పీఎఫ్ పైసలు ఇక చిటికెలో కొత్త అకౌంట్‌లోకి
EPF Money : ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత కంపెనీకి సంబంధించిన పీఎఫ్ అమౌంట్‌ను కొత్త కంపెనీ ఖాతాలోకి మార్చుకోవడం ఒక పెద్ద ప్రహసనంలా అనిపిస్తుంది. చాలామంది సాఫ్ట్‌వేర్ లేదా ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారిన తర్వాత పాత పీఎఫ్ డబ్బులు కొత్త అకౌంట్లో కనిపించక ఆందోళన చెందుతుంటారు. అసలు ఈ డబ్బు ట్రాన్స్‌ఫర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎన్ని రోజుల్లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది?
సాధారణంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పీఎఫ్ డబ్బులు బదిలీ కావడానికి ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం 7 నుంచి 20 పని దినాలు పడుతుంది. మీరు ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత, మీ పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ యాజమాన్యం దానిని డిజిటల్‌గా ఆమోదించాల్సి ఉంటుంది. వారు ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్‌ఓ ఆఫీసులో వెరిఫికేషన్ పూర్తయి మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.
ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు
ఒకవేళ 20 రోజులు దాటినా మీ డబ్బు ట్రాన్స్‌ఫర్ కాకపోతే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండవచ్చు. మొదటిది KYC అసంపూర్తిగా ఉండటం. మీ ఆధార్, పాన్ లేదా బ్యాంకు వివరాలు అప్‌డేట్ కాకపోయినా ఆలస్యం అవుతుంది. అలాగే, పాత కంపెనీలో మీ పేరు లేదా పుట్టిన తేదీ వివరాలు, కొత్త కంపెనీ రికార్డులతో సరిపోలకపోయినా ఈపీఎఫ్‌ఓ మీ అభ్యర్థనను తిరస్కరిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, మీ బాస్ లేదా కంపెనీ హెచ్ఆర్ మీ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ను వెయిటింగ్‌లో ఉంచడం వల్ల కూడా ఆలస్యం జరుగుతుంది.
ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ఇలా ఉంటుంది
మీరు ముందుగా ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి, మీ UAN నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ Online Services లోకి వెళ్లి One Member One EPF Account ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ వివరాలు ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయగానే రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. మీరు ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ను పాత బాస్ లేదా కొత్త బాస్ ద్వారా ఆమోదింపజేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా కొత్త కంపెనీ ద్వారా ఆమోదింపజేసుకోవడం సులభమైన పద్ధతి.
త్వరగా కావాలంటే ఏం చేయాలి?
మీ పీఎఫ్ అమౌంట్ కేవలం 5 నుంచి 7 రోజుల్లోనే కొత్త అకౌంట్‌లోకి రావాలంటే మీ UAN ప్రొఫైల్‌లో ఆధార్, పాన్ కార్డులు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. మీ మొబైల్ నంబర్ కూడా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. మీరు రిక్వెస్ట్ పెట్టిన వెంటనే మీ కంపెనీ హెచ్ఆర్‌కి ఒక మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే, వారు త్వరగా అప్రూవ్ చేస్తారు. మీ వివరాలన్నీ పక్కాగా ఉంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది.