Plastic Notes: తడిచినా లేదా జేబులో ఎక్కువ కాలం ఉంచినా నోట్లు నలిగిపోవడం, చిరిగిపోవడం వంటి సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా ఈ రెండు రకాల విలువ కలిగిన ఒక్కో రకంలో 100 కోట్ల నోట్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి కేంద్రం అనుమతించినట్లు రాజ్యసభలో ఆర్థిక శాఖ రాతపూర్వక సమాధానం ద్వారా వెల్లడించింది.

ఆర్‌బీఐ ప్రతిపాదన, పాత నోట్ల భవిష్యత్తు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం 10, 20 రూపాయల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సిందిగా ఆర్‌బీఐ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ట్రయల్స్ విజయవంతమైతే రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నోట్లు క్రమం తప్పకుండా వినియోగంలోకి వస్తాయి. అయితే కొత్త ప్లాస్టిక్ నోట్లు వచ్చినంత మాత్రాన పాత కాగితపు నోట్లు రద్దు కావు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండూ మార్కెట్‌లో సమాంతరంగా చెల్లుబాటు అవుతాయి. కేవలం నోట్ల ఆయుష్షు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

తగ్గిన ద్రవ్యోల్బణం - సామాన్యుడికి ఊరట

ప్లాస్టిక్ నోట్ల అంశంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు తీపి కబుర్లను ప్రభుత్వం పార్లమెంట్‌లో పంచుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చింది. 2023-24లో 5.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, 2024-25లో 4.6 శాతానికి, 2025-26 నాటికి ఏకంగా 2.1 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరల వల్ల 2026-27 మొదటి త్రైమాసికంలో ఇది 3.9 శాతానికి కొద్దిగా పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే తక్కువగానే కొనసాగుతోంది.

మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనాలు

మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తిని పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉన్నవారికి పన్ను మినహాయింపు కల్పించగా, ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని ఇది రూ. 12.75 లక్షల వరకు పన్ను రహితంగా మారింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పాటు, వంటనూనెలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. ఈ చర్యల ఫలితంగా ప్రజల వ్యక్తిగత వినియోగ వ్యయం 2023-24లోని 4.8 శాతం నుంచి 2025-26 నాటికి 6.8 శాతానికి పెరిగింది.

Tags: