PM Kisan : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే వెంటనే ఈ పని చేయండి

పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే వెంటనే ఈ పని చేయండి

Update: 2026-02-28 03:25 GMT

PM Kisan : ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా అన్నదాతలు ఒకే విషయం గురించి తెగ వెతికేస్తున్నారు. అదే పీఎం కిసాన్ e-KYC. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. గత వారం రోజులుగా లక్షలాది మంది రైతులు తమ ఈ-కేవైసీ స్టేటస్‌ను చెక్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులను విడుదల చేయనుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 మూడు విడతల్లో అందుతాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డబ్బులు మీ ఖాతాలోకి చేరాలంటే e-KYC పూర్తి చేయడం ఇప్పుడు తప్పనిసరి.

పీఎం కిసాన్ పథకాన్ని నిరంతరాయంగా పొందాలంటే రైతులు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ మీకు స్మార్ట్‌ఫోన్ వాడటం రాకపోతే, దగ్గరలోని మీ-సేవా కేంద్రం లేదా కామన్ సర్వీస్ సెంటర్‎కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కూడా దీనిని పూర్తి చేయవచ్చు.

ఇక ఈ ఏడాది నుంచి ప్రభుత్వం మరో కొత్త నిబంధనను కూడా అమల్లోకి తెచ్చింది. ప్రతి రైతుకు ప్రత్యేకంగా ఫార్మర్ ఐడీ ఉండాలని స్పష్టం చేసింది. దీనికోసం AgriStack పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా ఈ ఐడీని జారీ చేస్తారు. ప్రభుత్వ పథకాలు నేరుగా, పారదర్శకంగా రైతులకు చేరాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం వివిధ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తోంది. అర్హత లేని వారు, నకిలీ పత్రాలతో లబ్ధి పొందుతున్న వారిని ఏరివేసేందుకు ఈ ఫార్మర్ ఐడీ, e-KYC కీలకపాత్ర పోషిస్తాయి.

అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.. తదుపరి విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. చివరి విడత అక్టోబర్ 2025లో విడుదలైంది. కాబట్టి 2026 మొదటి విడత నిధులు ఏ క్షణమైనా అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో పడే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే e-KYC, ఫార్మర్ ఐడీ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ఎలాంటి అడ్డంకులు లేకుండా సమ్మాన్ నిధి మీ సొంతమవుతుంది.

Tags:    

Similar News