CNG, PNG Prices : ప్రధాని మోదీ న్యూ ఇయర్ కానుక..జనవరి 1 నుంచి CNG, PNG ధరలు తగ్గుదల
జనవరి 1 నుంచి CNG, PNG ధరలు తగ్గుదల
CNG, PNG Prices : నూతన సంవత్సరం 2026 దేశంలోని కోట్ల మంది గ్యాస్ వినియోగదారులకు శుభవార్త తీసుకురాబోతోంది. పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు టారిఫ్ రేషనలైజేషన్‌ను ప్రకటించింది. ఇది 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త ఏకీకృత టారిఫ్ నిర్మాణం వలన వినియోగదారులు రాష్ట్రం, వర్తించే పన్నుల ఆధారంగా ప్రతి యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు ఆదా చేసుకోగలుగుతారు. ఈ కొత్త విధానం రవాణా రంగంలో CNG వాడే వినియోగదారులకు, అలాగే వంట గదిలో PNG వాడే గృహ వినియోగదారులకు కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆయన వెల్లడించారు.
కొత్త టారిఫ్ నిర్మాణాన్ని సులభతరం చేయడానికి, PNGRB జోన్ల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించింది. 2023 నాటి పాత విధానంలో దూరం ఆధారంగా టారిఫ్‌ను మూడు జోన్‌లుగా విభజించేవారు. ఉదాహరణకు 1,200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి రూ.107 వరకు ఉండేది. ఇప్పుడు మూడు జోన్లకు బదులుగా కేవలం రెండు జోన్‌లు మాత్రమే ఉంటాయి. దేశవ్యాప్తంగా CNG, దేశీయ PNG కస్టమర్లకు వర్తించే జోన్-1 కోసం కొత్త ధర రూ.54 గా నిర్ణయించబడింది. ఇదివరకు ఈ ధరలు రూ.80, రూ.107 వరకు ఉండేవి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 312 భౌగోళిక ప్రాంతాలలో పనిచేస్తున్న దాదాపు 40 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలకు వర్తిస్తుంది.
ప్రభుత్వ లక్ష్యం దేశవ్యాప్తంగా సహజ వాయువు వినియోగాన్ని పెంచడం. దీని కోసం రాయితీలు, రేషనలైజ్డ్ గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. PNGRB సంస్థ కేవలం రెగ్యులేటర్‌గా మాత్రమే కాకుండా, ఈ రంగంలో ఆపరేటర్ల ప్రయోజనాలతో పాటు సాధారణ వినియోగదారుల ప్రయోజనాలను కూడా సమతుల్యం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని కచ్చితంగా సాధారణ వినియోగదారులకు అందేలా బోర్డు పర్యవేక్షిస్తుందని తివారీ తెలిపారు. ఈ లక్ష్యం నెరవేరడం కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను తగ్గించాయి. అనుమతి ప్రక్రియను సులభతరం చేశాయి.