Shilpa Shetty : రాజ్ కుంద్రా, శిల్పా శెట్టికి షాక్.. రూ.60 కోట్లు కట్టి విదేశాలకు పోండి.. బాంబే హైకోర్టు కఠిన నిర్ణయం
రూ.60 కోట్లు కట్టి విదేశాలకు పోండి.. బాంబే హైకోర్టు కఠిన నిర్ణయం
Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి పెద్ద న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈసారి సుమారు రూ.60 కోట్లకు సంబంధించిన భారీ రుణ ఎగవేత కేసులో ఆయన ఇరుక్కున్నారు. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఒక బిజినెస్ డీల్ కోసం తీసుకున్న పెట్టుబడి ఆధారిత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయానని రాజ్ కుంద్రా స్వయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కోఠారి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ప్రారంభించిన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టే పేరుతో తన నుండి రుణం తీసుకున్నారని దీపక్ కోఠారి ఆరోపించారు. 2015 ఏప్రిల్‌లో సుమారు రూ.31.95 కోట్లు, సెప్టెంబర్ 2015లో రూ.28.53 కోట్లు కలిపి, మొత్తం రూ.60 కోట్లకు పైగా పెట్టుబడి ఆధారిత రుణం ఇచ్చానని ఆయన తెలిపారు. ఈ పెట్టుబడిపై 12% వడ్డీతో పాటు నెలవారీ రాబడిని ఇస్తామని హామీ ఇచ్చినా, అనేకసార్లు అడిగినా డబ్బు తిరిగి చెల్లించలేదని దీపక్ కోఠారి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసుపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు సంస్థల ముందు రాజ్ కుంద్రా స్వయంగా ఒక సంచలన విషయాన్ని అంగీకరించారు. 2016లో జరిగిన నోట్ల రద్దు కారణంగా తమ కంపెనీ పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని, అందుకే తాము ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయామని ఆయన ఒప్పుకున్నారు. ఈ అంగీకారం, ఈ కేసు కేవలం వ్యాపార వివాదం కాకుండా, చీటింగ్ కేసుగా మారడానికి బలం చేకూర్చింది.
ఈ వివాదం నడుస్తుండగానే, తమకు డబ్బు తిరిగి ఇవ్వాలని ఫిర్యాదుదారు దీపక్ కోఠారి అడిగినప్పుడు, ఆ కంపెనీ దివాలా తీసే ప్రక్రియలో ఉందని తెలిసిందని నివేదిక పేర్కొంది. సరిగ్గా అదే సమయంలో శిల్పా శెట్టి కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ విషయంలో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ కేసుపై ప్రస్తుతం బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. విదేశాలకు వెళ్లేందుకు తమపై ఉన్న లుక్ అవుట్ సర్క్యులర్ ను రద్దు చేయాలని రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కోర్టును కోరారు. అయితే, కోర్టు అందుకు నిరాకరిస్తూ ముందుగారూ. 60 కోట్ల రుణ మొత్తాన్ని కోర్టులో జమ చేస్తేనే విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 14న జరగనుంది.