RBI FD New Rules: అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు.. బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్
బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్
RBI FD New Rules: ప్రతి నెలా మొదటి తేదీన పలు కొత్త నిబంధనలు అమల్లోకి రావడం మనం చూస్తుంటాం. అదేవిధంగా అక్టోబర్ 1, 2026 నుంచి దేశంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మార్పులు ప్రధానంగా పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసే బల్క్ డిపాజిటర్లపై, బ్యాంకులపై ప్రత్యేక ప్రభావం చూపనున్నాయి. మీరు ఇప్పటికే ఎఫ్‌డీలు కలిగి ఉన్నా లేదా కొత్తగా డిపాజిట్ చేయాలని భావిస్తున్నా, ఈ కొత్త నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.
బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. బల్క్ డిపాజిట్ అనగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్ల విషయంలో మార్పులు తెచ్చారు. ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. భారీ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించుకునే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు కల్పించడం. దీనివల్ల బ్యాంకులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను సవరించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కస్టమర్లకు డిపాజిట్ వడ్డీ రేట్ల గురించిన సమాచారం సులభంగా అందేలా చర్యలు చేపట్టారు.
వెబ్‌సైట్‌లో వడ్డీ రేట్ల అప్‌డేట్ తప్పనిసరి
అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలి. ఇందులో బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లు కూడా విధిగా ఉండాలి. ప్రతి పని దినం ఉదయం 10:00 గంటల కల్లా ఈ వడ్డీ రేట్లను బ్యాంకులు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అదనంగా 10 నిమిషాల గడువు ఇచ్చి, గరిష్టంగా ఉదయం 10:10 గంటలలోపు అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది.
ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ కొత్త నిబంధనలన్నీ ప్రధానంగా పెద్ద మొత్తంలో అంటే బల్క్ డిపాజిట్లు చేసే వారికే ఎక్కువగా వర్తిస్తాయి. కాబట్టి కొద్దిపాటి మొత్తం వేలల్లో లేదా లక్షల్లో సాధారణ ఎఫ్‌డీలు చేసుకున్న చిన్న మదుపర్లపై దీని ప్రభావం నేరుగా ఉండదు. సాధారణ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో ఎలాంటి ఆకస్మిక మార్పులు ఉండవు. అయితే బ్యాంకులు తమ అవసరాలు మరియు మార్కెట్ డిమాండ్ బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి కాబట్టి, భారీ మొత్తాలు దాచే వారికి మాత్రం ప్రత్యేక వడ్డీ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.