RBI : డబ్బులు డబుల్ అవుతాయంటే నమ్మేయకండి..ఆర్బీఐ సచేత్తో మోసగాళ్ల గుట్టు రట్టు చేయండి
.ఆర్బీఐ సచేత్తో మోసగాళ్ల గుట్టు రట్టు చేయండి
RBI : ప్రస్తుతం సోషల్ మీడియాలో తక్కువ పెట్టుబడి-ఎక్కువ లాభం అంటూ వచ్చే ప్రకటనలు చూసి చాలామంది మోసపోతున్నారు. మేము సెబి లేదా ఆర్బీఐ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పి నమ్మబలికి, వేలకు వేలు వసూలు చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sachet.rbi.org.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీరు ఒక కంపెనీ అసలు రంగును తెలుసుకోవచ్చు.
ఏదైనా సంస్థ మీ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించాలంటే దానికి ఆర్బీఐ లేదా సెబి వంటి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి ఉండాలి. ఆ కంపెనీకి నిజంగానే అనుమతి ఉందో లేదో తెలుసుకోవడానికి సచేత్ పోర్టల్‌లో Registered Entities అనే ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ఆర్బీఐ, సెబి, ఐఆర్డీఏఐ వంటి సంస్థల కింద రిజిస్టర్ అయిన అన్ని కంపెనీల అప్‌డేటెడ్ లిస్ట్ ఉంటుంది. ఆ జాబితాలో మీకు ఆఫర్ ఇచ్చిన కంపెనీ పేరు లేకపోతే.. అది పక్కా మోసపూరితమైనదని అర్థం చేసుకోవాలి.
ఒకవేళ మీరు అప్పటికే ఏదైనా స్కీమ్‌లో డబ్బులు పెట్టి మోసపోయినా లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసినా, ఇదే పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. హోమ్ పేజీలో ఉండే File a Complaint ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు, ఆ మోసానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ కంపెనీ ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి వస్తుందో మీకు తెలియకపోయినా పర్వాలేదు, పోర్టల్ అడ్మినిస్ట్రేటర్లు ఆ ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు పంపిస్తారు.
చాలామంది సెబి రిజిస్టర్డ్ అని అబద్ధం చెప్పి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తుంటారు. ఇంకొందరు అత్యధిక వడ్డీ ఇస్తామని నమ్మిస్తుంటారు. ఇలాంటి వారి మాయలో పడకముందే సచేత్ సహాయం తీసుకోవడం ఉత్తమం. ఇది కేవలం ఫిర్యాదులకే కాదు, ఆర్థిక మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే సమాచారాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి మీ కష్టార్జితాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఒక్క నిమిషం కేటాయించి ఈ పోర్టల్‌లో తనిఖీ చేసుకోండి.