Rs 2000 Notes : 2000 నోట్లపై ఆర్బీఐ కీలక అప్‌డేట్.. ఇంకా మీ దగ్గర ఉన్నాయా ?
ఇంకా మీ దగ్గర ఉన్నాయా ?;
Rs 2000 Notes : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించి దాదాపు రెండేళ్లు అవుతున్నా, ఇంకా రూ. 6,017 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. మే 19, 2023న ఆర్బీఐ ఈ నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం, మే 19, 2023న మార్కెట్‌లో మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉన్నాయి. అయితే, జులై 31, 2025 నాటికి ఈ మొత్తం రూ. 6,017 కోట్లకు తగ్గింది. అంటే, మార్కెట్‌లో ఉన్న రూ. 2000 నోట్లలో 98.31 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి.
మీ దగ్గర ఇంకా రూ. 2000 నోట్లు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నోట్లను మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మే 19, 2023 నుంచి ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో నేరుగా ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 9, 2023 నుంచి, దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా మీరు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను ఆర్బీఐ కార్యాలయాలకు పంపించి మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి.
2016లో పాత రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసినప్పుడు, ప్రజలకు త్వరగా కరెన్సీ అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రూ. 2000 నోట్లను విడుదల చేసింది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 24(1) కింద ముద్రించారు. అయితే, ఈ నోటు విడుదల చేసిన ఉద్దేశ్యం నెరవేరిన తర్వాత, అంటే ఇతర విలువ నోట్లు (రూ. 500, రూ. 200, రూ. 100) తగినంత అందుబాటులోకి వచ్చాక, 2018-19 నుంచే రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేశారు. అలాగే, చాలా వరకు రూ. 2000 నోట్లు 2017 మార్చికి ముందు ముద్రించినవి, వాటి గడువు కాలం (4-5 సంవత్సరాలు) పూర్తవడంతో పాటు, ఈ నోట్లు రోజువారీ లావాదేవీలలో పెద్దగా వాడకంలో లేకపోవడంతో ఆర్బీఐ వీటిని ఉపసంహరించుకుంది.