Reliance Retail : క్విక్ కామర్స్ లో అంబానీ విశ్వరూపం..స్విగ్గి, బ్లింకిట్ ఇక క్లోజ్?
స్విగ్గి, బ్లింకిట్ ఇక క్లోజ్?
Reliance Retail : క్విక్ కామర్స్ మార్కెట్‌లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే బ్లింకిట్, స్విగ్గి ఇన్స్టామార్ట్ వంటి సంస్థలకు ఇప్పుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు నష్టాల్లో నడుస్తున్న ఈ రంగంలో, రిలయన్స్ కేవలం కొద్ది నెలల్లోనే లాభాల బాట పట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా క్విక్ కామర్స్ రంగంలో లాభాలు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. డెలివరీ ఛార్జీలు, స్టోర్ మెయింటెనెన్స్ ఖర్చులతో బ్లింకిట్, స్విగ్గి వంటి సంస్థలు ఇంకా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్ 2024లో ప్రారంభించిన రిలయన్స్ క్విక్ కామర్స్ విభాగం ఇప్పుడు ప్రతి ఆర్డర్‌పై లాభం సంపాదిస్తోందని స్పష్టం చేసింది. అటు కంపెనీకి చెందిన ఎఫ్ఎంసిజి వ్యాపారం కూడా మూడేళ్లలోనే లాభాల్లోకి రావడం విశేషం.
సక్సెస్ సీక్రెట్ ఏంటి?
రిలయన్స్ ఇంత వేగంగా లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం వారి సోర్సింగ్ పవర్. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్. వీరు కంపెనీల నుంచి టన్నుల కొద్దీ సరుకులను నేరుగా కొనుగోలు చేస్తారు. భారీ మొత్తంలో ఆర్డర్లు ఇస్తారు కాబట్టి, సరుకులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇదే లాభం క్విక్ కామర్స్‌లో వీరికి కలిసి వస్తోంది. రిలయన్స్ రిటైల్ సీఎఫ్ఓ దినేష్ తలుజా ప్రకారం.. వృధాను అరికట్టడం, సప్లై చైన్‌ను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గాయి. ఇతర స్టోర్లలో 30 శాతం వరకు ఉండే వేస్టేజ్, రిలయన్స్‌లో చాలా తక్కువగా ఉంది.
రోజుకు 16 లక్షల డెలివరీలు
డిసెంబర్ 2025 త్రైమాసికం నాటికి రిలయన్స్ క్విక్ కామర్స్‌కు రోజుకు సగటున 16 లక్షల ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఆర్డర్ల సంఖ్య 53 శాతం పెరుగుతూ పోతోంది. రిలయన్స్ దగ్గర సుమారు 3,000 అవుట్‌లెట్లు ఉన్నాయి, అందులో 800 డార్క్ స్టోర్స్ (కేవలం డెలివరీ కోసం వాడేవి). వీరు కేవలం కిరాణా సామాగ్రి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వస్తువులను కూడా 10 నిమిషాల్లో ఇంటికి పంపిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాల విభాగం నుంచి రిలయన్స్‌కు భారీగా ఆదాయం వస్తోంది.
పోటీదారులకు వణుకు
ప్రస్తుతం ఈ రేసులో ఉన్న బ్లింకిట్ కొన్ని నగరాల్లో లాభాల్లో ఉన్నప్పటికీ, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ఇంకా నష్టాలనే చవిచూస్తోంది. స్విగ్గి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. కానీ రిలయన్స్ దగ్గర ఉన్న భారీ నెట్‌వర్క్, అపరిమితమైన నిధులు మరియు సొంత బ్రాండ్ల వల్ల వారు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందించగలుగుతున్నారు. అంబానీ ఎంటర్ అయిన ప్రతి రంగంలోనూ నంబర్ 1 గా నిలిచినట్లే, ఇప్పుడు క్విక్ కామర్స్ రంగంలో కూడా తన జెండా పాతేందుకు సిద్ధమయ్యారు.