Rent vs Buy : అద్దె ఇల్లా? సొంత ఇల్లా? 1% ఫార్ములాతో మీ కన్ఫ్యూజన్ కి చెక్ పెట్టండి
1% ఫార్ములాతో మీ కన్ఫ్యూజన్ కి చెక్ పెట్టండి
Rent vs Buy : ప్రతి సామాన్యుడి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ధర్మసంకటం ఏంటంటే.. జీవితాంతం అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని జేబులు నింపాలా? లేక బ్యాంకులో భారీగా లోన్ తీసుకుని సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలా? ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు, ఎందుకంటే ఇందులో మీ జీవితకాల సంపాదన దాగి ఉంటుంది. మీరూ ఇలాంటి సందిగ్ధంలోనే ఉంటే, రియల్ ఎస్టేట్ రంగంలో పాపులర్ అయిన 1% రూల్ మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఈ ఫార్ములా మీ పెట్టుబడికి లాభం ఉందో లేదో ఇట్టే చెప్పేస్తుంది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడి ప్రపంచంలో ఈ 1% రూల్ చాలా సింపుల్. దీని ప్రకారం.. మీరు పెట్టుబడి కోసం ఏదైనా ఇల్లు కొంటున్నప్పుడు, ఆ ఇంటి నుండి వచ్చే నెలవారీ అద్దె దాని మొత్తం ధరలో కనీసం 1 శాతంగా ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక కోటి రూపాయల ఫ్లాట్ కొన్నారనుకోండి, దానికి నెలకు ఒక లక్ష రూపాయల అద్దె రావాలి. ఒకవేళ వచ్చే అద్దె అంతకంటే చాలా తక్కువగా ఉంటే, పెట్టుబడి పరంగా ఆ ఇల్లు కొనడం మీకు నష్టదాయకం కావచ్చు. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే.. (నెలవారీ అద్దె ÷ ఆస్తి ధర) × 100. ఈ లెక్కలో సమాధానం 1కి దగ్గరగా ఉంటే అది మంచి డీల్ అని అర్థం.
భారతదేశంలో ఈ రూల్ పనిచేస్తుందా?
విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఫార్ములా బాగా పనిచేస్తుంది. కానీ మన భారతీయ మార్కెట్ పరిస్థితి భిన్నంగా ఉంది. కొల్లియర్స్ ఇండియా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన దేశంలో నివాస గృహాలపై అద్దె ఆదాయం కేవలం 2% నుంచి 4% మధ్యలోనే ఉంటుంది. ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి ధరలు ఆకాశంలో ఉంటే, అద్దెలు మాత్రం నేల మీద ఉన్నాయి. అందుకే పాత ఇంటిని తక్కువ ధరకు కొని, దాన్ని రిపేర్ చేసి అద్దెకు ఇచ్చే సమయంలో ఈ 1% రూల్ కొంతవరకు పనికిరావచ్చు కానీ, కొత్త ఇళ్ల విషయంలో ఇది కష్టమే.
కేవలం లెక్కలతోనే జీవిత నిర్ణయాలు తీసుకోలేము. సొంత ఇల్లు అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, అది ఒక మానసిక ప్రశాంతత, సామాజిక భద్రతకు గుర్తు. అద్దె ఇంట్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ సొంత ఇంట్లో ఉండదు. మీరు ఒకే నగరంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఉండాలనుకుంటే ఇల్లు కొనడం తెలివైన పని. కానీ మీ ఉద్యోగం ఊర్లు మార్చేది అయితే, భారీ ఈఎంఐల భారం కంటే అద్దె ఇంట్లో ఉండటమే మేలు. ఆస్తి విలువ పెరగడం, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అడుగు వేయండి.