Poultry Ban : భారత్ పౌల్ట్రీకి సౌదీ షాక్.. కోడి మాంసం, గుడ్ల దిగుమతులపై నిషేధం

కోడి మాంసం, గుడ్ల దిగుమతులపై నిషేధం

Update: 2026-02-28 03:33 GMT

Poultry Ban : అంతర్జాతీయ మార్కెట్లో భారత పౌల్ట్రీ రంగానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత్ సహా సుమారు 40 దేశాల నుంచి కోడి మాంసం, గుడ్ల దిగుమతిపై సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బర్డ్ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధం విధిస్తున్నట్లు సౌదీ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక మార్కెట్లో ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడమే తమ లక్ష్యమని సౌదీ స్పష్టం చేసింది.

ఈ నిషేధిత జాబితాలో కేవలం భారత్ మాత్రమే కాకుండా చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇరాన్, యూకే వంటి దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ దేశాల నుంచి వచ్చే పౌల్ట్రీ ఉత్పత్తులకు సౌదీలో ప్రవేశం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతుండటంతో సౌదీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి 16 దేశాలపై మాత్రం పాక్షికంగా ఆంక్షలు విధించింది. అంటే ఆయా దేశాల్లో వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులపై మాత్రమే నిషేధం ఉంటుంది.

అయితే కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి ఉండే ఉత్పత్తులకు మినహాయింపునిచ్చారు. వైరస్‌లను నాశనం చేసే హీట్ ట్రీట్‌మెంట్ వంటి అధునాతన పద్ధతులను పాటించే పౌల్ట్రీ ఫారమ్‌ల నుంచి వచ్చే మాంసం, గుడ్లను అనుమతిస్తారు. కానీ ఆ ఫారమ్‌లు సంబంధిత దేశాల ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు పొంది ఉండటంతో పాటు, సౌదీ విధించిన అన్ని ఆరోగ్య నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్న పౌల్ట్రీ ఉత్పత్తులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.

భారతదేశంపై ఈ నిషేధ ప్రభావం ఎంత ఉంటుంది అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. వాస్తవానికి భారత్ నుంచి సౌదీ అరేబియాకు పౌల్ట్రీ ఎగుమతులు భారీగా ఏమీ ఉండవు. 2024 గణాంకాల ప్రకారం.. డైరీ ఉత్పత్తులు, గుడ్లు, తేనె వంటివన్నీ కలిపి భారత్ సుమారు 64 మిలియన్ డಾಲర్ల (సుమారు రూ.500 కోట్లు) విలువైన ఎగుమతులు చేసింది. ఇందులో కేవలం కోడి మాంసం, గుడ్ల వాటా చాలా తక్కువ. కాబట్టి ఈ నిర్ణయం వల్ల భారత్‌కు కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని అంచనా. అయితే, ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తుల విశ్వసనీయతపై దీని ప్రభావం పడకుండా ఉండాలని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News