SBI FD: ఎస్‌బీఐ ఎఫ్‌డీ ధమాకా.. రూ.లక్ష డిపాజిట్‌పై రెట్టింపు రాబడి.. పూర్తి లెక్కలు ఇవే
పూర్తి లెక్కలు ఇవే
SBI FD: తమ కష్టార్జితాన్ని సురక్షితమైన ప్రదేశంలో దాచుకుని, నిలకడైన రాబడిని కోరుకునే ఇన్వెస్టర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా నిలుస్తుంది. షేర్ మార్కెట్ లాంటి హెచ్చుతగ్గుల ప్రమాదం లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకోవడం సురక్షితమైన మార్గం. ఎస్‌బీఐ రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే వేర్వేరు కాలపరిమితుల్లో ఎంత రాబడి వస్తుందో స్పష్టమైన లెక్కలతో తెలుసుకోవచ్చు.
సాధారణ పౌరులకు డిపాజిట్ రాబడులు
సాధారణ వినియోగదారులు రూ.లక్షను సంవత్సరం కాలపరిమితితో ఎఫ్‌డీ చేస్తే 6.25 శాతం వార్షిక వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి రూ.1,06,398 అందుతాయి. అదే 3 ఏళ్ల కాలానికి 6.30 శాతం వడ్డీతో రూ.1,20,642 రాబడి లభిస్తుంది. 5 ఏళ్ల కాలపరిమితికి 6.05 శాతం వడ్డీతో రూ.1,34,982 వరకు సొంతం చేసుకోవచ్చు. కాంపౌండింగ్ శక్తి కారణంగా 10 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి ఎంచుకుంటే రూ.లక్ష కాస్తా రూ.1,82,400 వరకు పెరుగుతుంది.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలు
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ సాధారణ కస్టమర్ల కంటే 0.50 శాతం అదనపు వడ్డీని ఇస్తోంది. సంవత్సర ఎఫ్‌డీపై 6.75 శాతం వడ్డీతో రూ. 1,06,920 వస్తాయి. 3 ఏళ్ల కాలానికి 6.80 శాతం వడ్డీతో రూ.1,22,430 అందుతాయి. 5 ఏళ్లకు 7.05 శాతం ఆకర్షణీయ వడ్డీతో రూ.1,41,680 వరకు లభిస్తుంది. ఇక 10 ఏళ్ల కాలపరిమితిలో వడ్డీ రేటుతో కలిపి రూ. లక్ష అమౌంట్ ఏకంగా రూ.2,01,000 దాటుతుంది. అంటే సీనియర్ సిటిజన్ల డబ్బు డబుల్ కంటే ఎక్కువవుతుంది.
వడ్డీ ఆదాయంపై పన్ను నిబంధనలు
ఎఫ్‌డీ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండదు. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఎఫ్‌డీలపై లభించే పూర్తి వడ్డీ అమౌంట్ పన్ను పరిధిలోకి వస్తుంది. డిపాజిట్‌దారుల వార్షిక ఆదాయం, వారు ఎంచుకునే ఓల్డ్ టాక్స్ లేదా న్యూ టాక్స్ స్లాబ్ విధానాన్ని బట్టి ఎఫ్‌డీ వడ్డీపై కట్టాల్సిన టాక్స్ ఆధారపడి ఉంటుంది. పన్ను పరిమితి దాటితే బ్యాంకులు నిర్ణీత పరిమితిలో టీడీఎస్ కూడా కోత విధిస్తాయి.
టీడీఎస్ రీఫండ్ పొందే వెసులుబాటు
ఎఫ్‌డీ వడ్డీపై బ్యాంకులు కోసే టీడీఎస్ అనేది అదనపు పన్ను కాదు. ఆర్థిక సంవత్సరం చివరలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేసేటప్పుడు ఈ కట్ అయిన టీడీఎస్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. మొత్తం వార్షిక ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉండి, పన్ను బాధ్యత సున్నా అయితే, ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా బ్యాంక్ కోత విధించిన టీడీఎస్‌ను రీఫండ్‌గా తిరిగి పొందే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుంది.