September 1 Rule Changes: ఎల్‌పిజి గ్యాస్, ఆధార్ నుంచి బ్యాంకింగ్ వరకు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
September 1 Rule Changes: ప్రతి నెలా ప్రారంభంలో సామాన్యుల జీవితాలు, ఆర్థిక నిబంధనలపై ప్రభావం చూపే కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అదే క్రమంలో సెప్టెంబర్ 01 నుంచి ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఆధార్ వివరాల అప్‌డేట్, బ్యాంకింగ్ నియమాల్లో పలు ముఖ్యమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. వీటిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.
ఎల్‌పిజి గ్యాస్ ధరలు, ఇ-కేవైసీ మార్పులు
చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి తేదీన సమీక్ష నిర్వహిస్తాయి. దాని ఆధారంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ 1న గ్యాస్ సిలిండర్ ధరల పునఃసమీక్ష ఉండనుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇచ్చిన ఆగస్టు 31 గడువుతో సమయం ముగియనుంది. సెప్టెంబర్ నుంచి ఆధార్ బయోమెట్రిక్ ఇ-కేవైసీ లేని వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్
పిల్లలు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, ఐరిష్ గుర్తులు మారతాయి. అందుకే 5 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ ముగించడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల పొందేందుకు ఈ అప్‌డేట్ తప్పనిసరి. తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా తమ పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఆధార్ కేంద్రాల్లో నమోదు చేయించాలి.
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకింగ్ నియమాలు
బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ల నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను బ్యాంకులు పారదర్శకంగా వెల్లడించాలి. ప్రతి పనిదినం ఉదయం 10:10 గంటలకల్లా తమ అధికారిక వెబ్‌సైట్లలో ఈ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కస్టమర్లకు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సులభంగా పోల్చి చూసుకునే వీలు కలుగుతుంది.