Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా ఖాతాలో రూ. 12,490 కోట్లు.. హురూన్ రిచ్ లిస్ట్‌లో చేరిన షారుఖ్ ఖాన్
హురూన్ రిచ్ లిస్ట్‌లో చేరిన షారుఖ్ ఖాన్
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు 2025 సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. ఇటీవల జాతీయ అవార్డు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు బిలియనీర్ల క్లబ్‌లో చేరి మరో ఘనత సాధించారు. తాజాగా విడుదలైన M3M హురూన్ ఇండియా శ్రీమంతుల జాబితా 2025 ప్రకారం, షారుఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ రూ. 12,490 కోట్లకు చేరుకుంది. దీంతో ఆయన బాలీవుడ్ సెలబ్రిటీలలో అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో నిలిచారు. సినిమా నటనతో పాటు వ్యాపారంలో కూడా షారుఖ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
షారుఖ్ ఖాన్ సంపాదనలో సింహభాగం ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచే వస్తుంది. 2002లో స్థాపించబడిన ఈ సంస్థ అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించింది. దాదాపు 500 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా వచ్చిన భారీ లాభాలు షారుఖ్‌ను ఈ మైలురాయికి చేర్చడంలో కీలకపాత్ర పోషించాయి. నటనతో పాటు, వ్యాపార సామర్థ్యం కూడా షారుఖ్ సంపదను పదిలపర్చింది.
జాబితాలోని టాప్ 5 ధనిక బాలీవుడ్ సెలబ్రిటీలు
షారుఖ్ ఖాన్ తర్వాత ఈ జాబితాలో అధిక సంపద కలిగిన బాలీవుడ్ ప్రముఖులు వీరే:
* జుహీ చావ్లా, కుటుంబం: రూ. 7,790 కోట్లు. (వీరికి నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సంస్థలో వాటా ఉంది).
* హృతిక్ రోషన్: రూ. 2,160 కోట్లు. (ఇతని ఫిట్‌నెస్ బ్రాండ్ HRX ద్వారా).
* కరణ్ జోహార్: రూ. 1,880 కోట్లు. (ఫిల్మ్ ప్రొడక్షన్, ఇతర వ్యాపారాల ద్వారా).
* అమితాబ్ బచ్చన్, కుటుంబం: రూ. 1,630 కోట్లు. (బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడుల ద్వారా).
ఈ ప్రముఖులంతా కేవలం సినిమా ఆదాయంపైనే కాకుండా, తమ వ్యాపార సంస్థలు,పెట్టుబడుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. షారుఖ్ ఖాన్ సంపద సినిమాలు, వ్యాపారంతోనే ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అనేక విలువైన ఆస్తులు, లగ్జరీ వస్తువులు ఉన్నాయి. సుమారు రూ. 200 కోట్ల విలువైన ముంబై మన్నత్ బంగ్లా ఆయన ఆస్తులలో అతి ముఖ్యమైనది. లండన్‌లోని పార్క్ లేన్‌లో అపార్ట్‌మెంట్, ఇంగ్లాండ్‌లో వెకేషన్ హౌస్, బెవర్లీ హిల్స్‌లో విల్లా, ఢిల్లీ, అలీబాగ్‌లో ఫామ్‌హౌస్‌లు, దుబాయ్‌లో లగ్జరీ నివాసం వంటి ఆస్తులు ఆయన నికర విలువను పెంచాయి. ఆయన గ్యారేజీలో BMW, Mercedes-Benz, Audi, Range Rover, Rolls-Royce, Bugatti వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.