SIP vs Lumpsum : లక్షలు ఒకేసారి పెట్టాలా? నెలకు కొంచెం దాచుకోవాలా? సిప్ లేక లంప్ సమ్..ఏది మీకు బెస్ట్?

సిప్ లేక లంప్ సమ్..ఏది మీకు బెస్ట్?

Update: 2026-03-10 10:19 GMT

SIP vs Lumpsum : షేర్ మార్కెట్ ప్రస్తుతం ఊగిసలాడుతోంది. ఎప్పుడు చూసినా రెడ్ మార్క్ కనిపిస్తుండటంతో సామాన్య పెట్టుబడిదారులు కంగారు పడుతున్నారు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం ఇది భయపడాల్సిన సమయం కాదు, పెట్టుబడి పెట్టడానికి దొరికిన అద్భుతమైన అవకాశం అని చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. మార్కెట్ పడుతున్నప్పుడు మన దగ్గరున్న డబ్బునంతా ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలా, లేక ప్రతి నెలా కొంచెం కొంచెం దాచుకుంటూ వెళ్లాలా ? ఏది చేస్తే లాభం ఎక్కువగా ఉంటుంది? ఏది సేఫ్? ఈ విషయాలను సులభంగా అర్థం చేసుకుందాం.

స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు చాలామంది తమ డబ్బు ఎక్కడ పోతుందో అని భయపడి వెనక్కి తీసుకుంటారు. కానీ తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం షేర్లు తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని కొనుగోలు చేస్తారు. అయితే మార్కెట్ ఎంత వరకు పడుతుంది. ఎప్పుడు మళ్ళీ పైకి లేస్తుంది అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అందుకే ఈ అనిశ్చితిలో మనం డబ్బులు పెట్టే పద్ధతి చాలా ముఖ్యం. మొత్తం డబ్బును ఒక్కసారి పెట్టడం వల్ల రిస్క్ ఉండవచ్చు, అదే సిప్ ద్వారా అయితే ఒక క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టవచ్చు.

మార్కెట్ పడుతోంది కదా అని మీ దగ్గరున్న లక్ష రూపాయలను ఈరోజే ఒకేసారి ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒకవేళ రేపు మార్కెట్ ఇంకా పడిపోతే మీ పెట్టుబడి విలువ వెంటనే తగ్గిపోతుంది. మళ్ళీ మార్కెట్ కోలుకుని మీరు పెట్టిన స్థాయికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. అంటే, మార్కెట్ ఇంకా పడుతున్న క్రమంలో ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయడం కొంచెం ప్రమాదకరమైన పనే.

మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు సిప్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే లాభం మీకు కలుగుతుంది. ఉదాహరణకు, మీరు నెలకు రూ.5,000 సిప్ కడుతున్నారు అనుకుందాం. మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తక్కువగా వస్తాయి. అదే మార్కెట్ పడిపోయినప్పుడు, మీ అదే రూ.5,000కు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఇలా మార్కెట్ పడినా లేచినా మీ పెట్టుబడి సగటున లాభాల్లోనే ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది మీకు భారీ సంపదను తెచ్చిపెడుతుంది.

అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు ఒక విభిన్నమైన వ్యూహాన్ని పాటిస్తారు. ఒకవేళ వారి దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉంటే, అందులో కొంత భాగాన్ని మాత్రమే ఇప్పుడున్న తక్కువ ధరల వద్ద ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన డబ్బును ప్రతి నెలా సిప్ రూపంలో మార్కెట్లోకి వదులుతారు. దీనివల్ల మార్కెట్ పతనంలో దొరికే లాభం వస్తుంది, అలాగే భవిష్యత్తులో మార్కెట్ ఇంకా పడినా నష్టం కలగకుండా రిస్క్ మేనేజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో గెలవాలంటే కావాల్సింది తెలివితేటల కంటే ఓపిక అని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News