SIP vs SWP: సిప్ వర్సెస్ ఎస్‌డబ్ల్యూపీ.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెండింటి మధ్య అసలు తేడా ఇదే
| రెండింటి మధ్య అసలు తేడా ఇదే
SIP vs SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ముందుగా వినిపించే రెండు పేర్లు సిప్, ఎస్‌డబ్ల్యూపీ . వినడానికి ఈ రెండూ దాదాపు ఒకేలా అనిపించినా, వీటి పనితీరు మాత్రం ఒకదానికి ఒకటి పూర్తిగా వ్యతిరేకం. ఒక విధానం చిన్న చిన్న పొదుపు మొత్తాలతో పెద్ద నిధిని తయారు చేయడానికి ఉపయోగపడితే, మరొక విధానం మీరు కూడబెట్టిన డబ్బు నుంచి ప్రతినెలా ఒక నిర్దిష్ట ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది. సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.
సిప్ ఎలా పనిచేస్తుంది?
సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు నిర్ణీత కాలానికి ఒకసారి మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెట్టుబడి పెడతారు. ముందుగా మీరు కోరుకున్న ఫండ్, పెట్టుబడి మొత్తం, తేదీని ఎంచుకుంటే చాలు.. ప్రతినెలా ఆ తేదీకి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ అవుతాయి. ఉదాహరణకు మీరు ఒక ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.5,000 సిప్ చేస్తున్నారనుకోండి. మార్కెట్ పడిపోయినప్పుడు ఫండ్ ఎన్ఏవీ తక్కువగా ఉండటం వల్ల మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీనినే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో దీనికి చక్రవడ్డీ బలం తోడై భారీ సంపద తయారవుతుంది.
ఎస్‌డబ్ల్యూపీతో ప్రతినెలా ఆదాయం ఎలా వస్తుంది?
ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఇది డబ్బులు పెట్టడానికి కాదు, మీ వద్ద ఉన్న నిధి నుంచి క్రమపద్ధతిలో డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడే విధానం. దీని కోసం మీ దగ్గర ముందుగానే సిప్ ద్వారా గానీ, ఒకేసారి (లంప్సమ్) గానీ జమ చేసిన మ్యూచువల్ ఫండ్ నిధి ఉండాలి. ఉదాహరణకు మీరు రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేసి, నెలకు రూ.15,000 ఎస్‌డబ్ల్యూపీ సెట్ చేసుకుంటే.. ప్రతినెలా ఫండ్ హౌస్ రూ.15,000 విలువైన యూనిట్లను అమ్మి ఆ డబ్బును నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు పంపుతుంది. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, మిగిలిన డబ్బు ఇంకా ఫండ్‌లోనే ఉండి మార్కెట్ ప్రకారం పెరుగుతూనే ఉంటుంది. అవసరమైతే మీరు తీసుకునే మొత్తాన్ని మార్చుకోవచ్చు లేదా ఆపేయవచ్చు కూడా.
రిటర్న్స్ గ్యారంటీ ఉంటుందా?
సిప్‌లో గానీ, ఎస్‌డబ్ల్యూపీలో గానీ ఎలాంటి గ్యారంటీ రిటర్న్స్ ఉండవనే విషయం ఇన్వెస్టర్లు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిలోనూ రాబడి అనేది మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ రకం (ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్), మార్కెట్ పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో మీరు తీసుకునే మొత్తం కంటే ఫండ్ ఇచ్చే రాబడి ఎక్కువగా లేదా సమానంగా ఉంటే, మీ అసలు డబ్బు చాలా కాలం పాటు తరిగిపోకుండా అలాగే ఉంటుంది. ఇక పన్నుల విషయానికి వస్తే.. సిప్‌లో డబ్బులు పెడుతున్నప్పుడు ఎలాంటి ట్యాక్స్ పడదు, కేవలం యూనిట్లు అమ్మినప్పుడే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఎస్‌డబ్ల్యూపీలో మాత్రం ప్రతినెలా డబ్బు తీసుకున్నప్పుడు అందులో లాభం ఉంటే, ఫండ్ రకం, హోల్డింగ్ కాలాన్ని బట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడొచ్చు. అయినా సరే, ఒకేసారి మొత్తం డబ్బు విత్‌డ్రా చేయడంతో పోలిస్తే ఎస్‌డబ్ల్యూపీలో ట్యాక్స్ భారం చాలా తక్కువగా ఉంటుంది.
రిస్క్ మధ్య ఎవరికి ఏది బెస్ట్ ఆప్షన్?
ఈ రెండు విధానాలూ మ్యూచువల్ ఫండ్స్‌తో ముడిపడి ఉన్నాయి కాబట్టి మార్కెట్ రిస్క్ కచ్చితంగా ఉంటుంది. సిప్‌ను మధ్యలోనే తొందరగా ఆపేస్తే దీర్ఘకాలంలో వచ్చే కాంపౌండింగ్ లాభం తగ్గిపోతుంది. మరోవైపు ఎస్‌డబ్ల్యూపీలో అవసరానికి మించి ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేసినా, మార్కెట్ బాగోలేకపోయినా మీ అసలు నిధి వేగంగా కరిగిపోయే ప్రమాదం ఉంది. మీ లక్ష్యాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోవాలి. మీకు ప్రతినెలా స్థిరమైన ఆదాయం ఉండి.. ఇల్లు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ కోసం డబ్బు కూడబెట్టాలనుకుంటే సిప్ ఉత్తమం. అదే రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఆదాయం కావాలంటే ఎస్‌డబ్ల్యూపీ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తెలివైన ఇన్వెస్టర్లు ఉద్యోగం చేసే రోజుల్లో సిప్ ద్వారా పెద్ద నిధిని తయారు చేసి, రిటైర్మెంట్ తర్వాత ఎస్‌డబ్ల్యూపీ ద్వారా నెలవారీ జీతంలా ఆదాయం పొందుతుంటారు.