Supreme Court : హెయిర్ కట్ నచ్చలేదని 5 కోట్ల డిమాండ్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Supreme Court : మనం సెలూన్‌కి వెళ్ళినప్పుడు హెయిర్ కట్ సరిగ్గా రాకపోతే కాసేపు అద్దం ముందు నిలబడి బాధపడతాం, మహా అయితే ఆ బార్బర్‌పై కోప్పడతాం. కానీ ఒక తప్పుడు హెయిర్ కట్ వల్ల ఏకంగా 5 కోట్ల రూపాయల పరిహారం కోరడం ఎక్కడైనా విన్నారా? ఇది ఏదో సినిమా కథ కాదు.. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఒక వింతైన, వాస్తవమైన కేసు. 2018లో మొదలైన ఈ వివాదం, ఎట్టకేలకు ఒక ముగింపుకు వచ్చింది. ఐఐఎం కలకత్తాలో చదివి, మోడలింగ్ రంగంలో రాణిస్తున్న ఒక మహిళకు జరిగిన అన్యాయంపై కోర్టు ఆసక్తికరమైన తీర్పునిచ్చింది.
అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
ఏప్రిల్ 2018లో ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న సెలూన్‌కి సదరు మహిళ హెయిర్ కట్ కోసం వెళ్ళింది. తన జుట్టును స్టైలిష్‌గా కట్ చేయమని కోరితే, అక్కడ పనిచేసే సిబ్బంది ఆమె జుట్టును చాలా చిన్నగా కట్ చేసేశారట. తాను ఒక కార్పొరేట్ మేనేజర్‌గా, మోడల్‌గా పనిచేస్తున్నానని.. ఈ చెత్త హెయిర్ కట్ వల్ల తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని ఆమె ఆరోపించింది. దీనివల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్ళానని, ఆఖరికి 2018 జూన్‌లో తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంటూ ఆమె కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది.
కన్జ్యూమర్ కోర్టు 2 కోట్లు ఇమ్మంటే.. సుప్రీం ఏమంది?
మొదట్లో ఈ కేసును విచారించిన వినియోగదారుల కమిషన్, సెలూన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. ఆ మహిళకు జరిగిన మానసిక క్షోభకు పరిహారంగా 2 కోట్ల రూపాయలు చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే, హోటల్ యజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్ళగా, కేసును మళ్ళీ సమీక్షించాలని కోర్టు వెనక్కి పంపింది. రెండోసారి విచారణలో ఆ మహిళ తన డిమాండ్‌ను ఏకంగా 5.2 కోట్లకు పెంచేసింది. కమిషన్ మళ్ళీ ఆమెకు అనుకూలంగా తీర్పునివ్వడంతో, హోటల్ యాజమాన్యం మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈసారి ఆ మహిళ ఎవరి సాయం తీసుకోకుండా స్వయంగా తన వాదనలను కోర్టులో వినిపించడం విశేషం.
ఆధారాలు లేని ఆరోపణలు చెల్లవు
ఫిబ్రవరి 6, 2026న ఈ కేసులో సుప్రీంకోర్టు అంతిమ తీర్పునిచ్చింది. 2 కోట్ల రూపాయల పరిహారాన్ని 25 లక్షలకు తగ్గిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. కేవలం భావోద్వేగాల ఆధారంగా లేదా అంచనాల ఆధారంగా కోట్ల రూపాయల పరిహారం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తన మోడలింగ్ అవకాశాలు పోయాయని ఆమె చెప్పినప్పటికీ, అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ కానీ, సదరు కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ల ఒరిజినల్ పత్రాలు కానీ ఆమె సమర్పించలేకపోయిందని కోర్టు గుర్తించింది. కేవలం ఫోటోకాపీల ఆధారంగా భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడం వినియోగదారుల కమిషన్ చేసిన పొరపాటని సుప్రీంకోర్టు పేర్కొంది.
సెలూన్ సేవలలో లోపం ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించిన కోర్టు, అందుకు 25 లక్షల రూపాయలు సరైన పరిహారమని తేల్చింది. ఏవైనా చట్టపరమైన పోరాటాలు చేసేటప్పుడు కేవలం వాదనలు మాత్రమే సరిపోవని, పక్కా ఆధారాలు ఉండాలని ఈ కేసు మరోసారి నిరూపించింది. హెయిర్ కట్ కోసం 5 కోట్లు అడగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.