Bullet Train : దేశంలో 7,000 కి.మీ నెట్‌వర్క్.. సౌతిండియాలోని 4 నగరాల్లో బుల్లెట్ రైలుకు సర్వే
సౌతిండియాలోని 4 నగరాల్లో బుల్లెట్ రైలుకు సర్వే
Bullet Train : భారతదేశం తన హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్, ముంబై మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ రైలు సిస్టమ్ తీసుకురావడానికి వివిధ మార్గాలను పరిశీలిస్తున్నారు. గత వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందని తెలిపారు. బెంగళూరుతో సహా దక్షిణ భారతదేశంలోని నాలుగు నగరాలను కలుపుతూ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ కోసం సర్వేకు ఆదేశాలు జారీ చేసినట్లు నాయుడు పేర్కొన్నారు.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్‌లో హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలు హై-స్పీడ్ రైలు మార్గంలో భాగం కానున్నాయి. ఈ కారిడార్‌లో ఉన్న నాలుగు నగరాల్లో ఐదు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉంది. కాబట్టి ఈ మార్గంలో హై-స్పీడ్ రైలుకు వాణిజ్యపరంగా చాలా డిమాండ్ ఉంటుందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ దక్షిణ భారతదేశ హై-స్పీడ్ రైలు కారిడార్ సిద్ధమైతే, అది దక్షిణ భారతదేశంలో ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని ఆయన అన్నారు.
గత వారం నరేంద్ర మోదీ జపాన్‌ను సందర్శించారు. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి మోడీ టోక్యో నుండి సెండై వరకు షిన్‌కాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా అక్కడి ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో 7,000 కి.మీ పొడవైన బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జపాన్ సాంకేతిక సహాయంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ షిన్‌కాన్సెన్ ఇ5 లేదా ఇ10 రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రైలు మార్గం మరో 2-3 సంవత్సరాలలో సిద్ధమవుతుంది.
బుల్లెట్ రైళ్లను ఎక్కడ నడపవచ్చని పరిశీలించే పని జరుగుతోంది. నేషనల్ రైల్ ప్లాన్ నుండి అనేక మార్గాలను గుర్తించారు. ఇందులో మైసూర్ కూడా ఉంది. ప్రస్తుతం గుర్తించిన కొన్ని మార్గాలు.. ఢిల్లీ – వారణాసి, ఢిల్లీ – అహ్మదాబాద్, ముంబై – నాగ్‌పూర్, ముంబై – హైదరాబాద్, చెన్నై – మైసూర్, ఢిల్లీ – అమృత్‌సర్, వారణాసి – హౌరా.
ఇంతకు ముందు బెంగళూరు, చెన్నై మధ్య బుల్లెట్ రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఇప్పుడు మైసూర్ నుండి చెన్నై వరకు బుల్లెట్ రైలు వెళ్ళాలంటే అది బెంగళూరు మీదుగా వెళ్ళాలి. అందుకే, బెంగళూరు - చెన్నై బదులుగా మైసూర్-చెన్నై రైలు మార్గాన్ని పరిశీలిస్తూ ఉండవచ్చు.