Sugar Stocks : సుప్రీంకోర్టు నిర్ణయంతో చక్కెర కంపెనీలకు ఊతం.. పరుగులు పెరుగుతున్న స్టాక్స్

పరుగులు పెరుగుతున్న స్టాక్స్

Update: 2025-09-02 09:36 GMT

Sugar Stocks : భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం కొత్త జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన కొత్త టారిఫ్‌ల ప్రభావాన్ని మన మార్కెట్ తట్టుకుని నిలబడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం వల్ల నేడు షుగర్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. ముఖ్యంగా రాజశ్రీ షుగర్, బలరాంపూర్ షుగర్ వంటి కంపెనీల షేర్లు 20% వరకు పెరిగాయి.

సుప్రీంకోర్టు నిర్ణయంతో చక్కెర కంపెనీలకు ఊతం

ఈ షేర్ల పెరుగుదలకు ప్రధాన కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. 20% ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం (E20) పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనితో, ఇకపై పెట్రోల్‌లో ఇథనాల్‌ను తప్పనిసరిగా కలపాల్సి ఉంటుంది. ఇది షుగర్ కంపెనీలకు భారీగా లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, చక్కెర మిల్లుల్లోనే ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను చెరుకు రసం, సిరప్, మొలాసిస్ నుండి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. ఈ రెండు నిర్ణయాలు షుగర్ స్టాక్స్‌లో సానుకూల ప్రభావాన్ని చూపించాయి.

చక్కెర స్టాక్స్‌కు, ఇథనాల్‌కు సంబంధం ఏమిటి?

దేశంలో ఇథనాల్‌ను తయారు చేసే ప్రధాన కర్మాగారాలు చక్కెర మిల్లులు. చెరకు నుండి చక్కెర ఉత్పత్తి చేసే ప్రక్రియలో వచ్చిన ఉప ఉత్పత్తుల నుండి ఇథనాల్‌ను తయారు చేస్తారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని తప్పనిసరి చేయడంతో, ఇథనాల్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్‌ను తీర్చాలంటే చక్కెర మిల్లులకు ఎక్కువ పని లభిస్తుంది. దీనితో కంపెనీల ఆదాయం, లాభాలు పెరుగుతాయి. అందుకే, సుప్రీంకోర్టు నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం చక్కెర కంపెనీలకు పెద్ద ఊతమిచ్చాయి.

ఏ ఏ షేర్లు ఎంత పెరిగాయి?

ఈ రోజు అంటే సెప్టెంబర్ 2, 2025న షుగర్ స్టాక్స్‌లో అద్భుతమైన వృద్ధి కనిపించింది. బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్ షేర్లు దాదాపు 6% పెరిగి రూ.573.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా, రాజశ్రీ షుగర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 20% పెరిగి దాదాపు రూ.8 వృద్ధిని సాధించి రూ.45.36కి చేరాయి. శ్రీ రేణుక షుగర్స్ షేర్లు కూడా 14% వరకు పెరిగాయి. ధర్మపూర్ షుగర్ మిల్స్, అవధ్ షుగర్ ఎనర్జీ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News