Donald Trump : ప్రపంచంపై ట్రంప్ పంజా..180రోజుల్లో సినిమా చూపించబోతున్న అమెరికా ప్రెసిడెంట్
180రోజుల్లో సినిమా చూపించబోతున్న అమెరికా ప్రెసిడెంట్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఆదేశం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల సరఫరా కోసం వచ్చే 180 రోజుల్లోగా అమెరికాతో ఖచ్చితమైన ఒప్పందాలు చేసుకోవాలని తన మిత్రదేశాలకు, వాణిజ్య భాగస్వామ్య దేశాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ డెడ్ లైన్ లోపు ఒప్పందాలు చేసుకోని దేశాలపై భారీ టారిఫ్ (సుంకాలు), వాణిజ్య ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఇతర దేశాల్లో ప్రాసెస్ చేయబడిన ఈ ఖనిజాలపై అమెరికా ఆధారపడటం జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనాది ఎదురులేని ఆధిపత్యం. దాదాపు 70 శాతం కంటే ఎక్కువ రిఫైనింగ్ సామర్థ్యం డ్రాగన్ కంట్రోల్‌లోనే ఉంది. సెమీకండక్టర్లు, డిఫెన్స్ సిస్టమ్స్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం. చైనా ఎప్పుడైనా సరఫరా నిలిపివేస్తే అమెరికా రక్షణ వ్యవస్థ కుప్పకూలుతుందన్నదే ట్రంప్ అతిపెద్ద భయం. అందుకే చైనా బయట ఇతర దేశాల్లో ఈ ఖనిజాల ఉత్పత్తిని పెంచి, తమకు శాశ్వత సరఫరా ఉండేలా చూసుకోవాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో లిథియం, కోబాల్ట్ పాత్ర చాలా పెద్దది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్ల తయారీ కంపెనీలపై పెను ప్రభావం పడనుంది. కంపెనీలు తమ పాత కాంట్రాక్టులను రద్దు చేసుకుని కొత్త వనరులను వెతుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల కార్ల ఉత్పత్తి ఖర్చు పెరగడమే కాకుండా, మార్కెట్లోకి కొత్త వాహనాలు వచ్చే సమయం కూడా ఆలస్యం కావచ్చు. అయితే దీర్ఘకాలంలో అమెరికా స్వయం సమృద్ధి సాధించడానికి ఇది అవసరమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ చర్చల ప్రక్రియను పర్యవేక్షించడానికి కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్, ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామీసన్ గ్రీర్‌లను ట్రంప్ నియమించారు. వీరు 13 జూలై 2026 నాటికి అన్ని దేశాలతో చట్టబద్ధమైన ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ దేశమైనా మొండికేస్తే, ఎవరితోనూ సంప్రదించకుండానే నేరుగా టారిఫ్ బాదుడు మొదలుపెట్టే అధికారాన్ని ట్రంప్ తన వద్దే ఉంచుకున్నారు. మొత్తం మీద ఖనిజాల వేటలో అమెరికా ఇప్పుడు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది.