Pensioners : వీళ్లు పెన్షన్ కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేరు.. ఎందుకంటే ?
Pensioners : ప్రతేడాది నవంబర్ నెల పింఛనుదారులకు చాలా ముఖ్యమైనది.
Pensioners : ప్రతేడాది నవంబర్ నెల పింఛనుదారులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభుత్వ పెన్షన్ అందుకునే వారందరూ తాము జీవించి ఉన్నామని ధృవీకరించుకోవాలి. అప్పుడే వారి పింఛను నిరాటంకంగా కొనసాగుతుంది. గతంలో ఈ ప్రక్రియ బ్యాంకుకు లేదా కార్యాలయానికి వెళ్లి చేయాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పేరుతో ఆన్‌లైన్‌లో అందించింది. అయితే ఈ డిజిటల్ విధానంలో కూడా కొంతమంది పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించడానికి వీలు లేని పరిస్థితి ఉంది. ఆ పెన్షనర్లు ఎవరు? డిజిటల్ విధానం ఎలా పనిచేస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ జీవన ప్రమాణ పత్రం అనేది పింఛనుదారులకు ప్రక్రియను సులభతరం చేసింది. ఇది పూర్తిగా ఆధార్ బయోమెట్రిక్ బేస్డ్ సిస్టమ్. పింఛనుదారుడు తన గుర్తింపును వేలిముద్రలు లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా ధృవీకరించుకోవాలి. ధృవీకరణ విజయవంతం కాగానే, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా రూపొంది ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లో సురక్షితంగా నిక్షిప్తమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్షనర్‌కు మొబైల్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, అందులో జీవన్ ప్రమాణ్ ఐడీ ఉంటుంది. ఈ ఐడీ సాయంతో ఎవరైనా ఆ పత్రం పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సాధారణంగా జీవన్ ప్రమాణ్ సిస్టమ్ ఒక పెన్షనర్‌ను తిరిగి ఉద్యోగంలో చేరని, పునర్వివాహం చేసుకోని వ్యక్తిగా పరిగణిస్తుంది. కానీ, కొంతమంది పెన్షనర్లు డిజిటల్‌గా తమ పత్రాన్ని సమర్పించడానికి వీలుండదు. ఒకవేళ పింఛనుదారుడు తిరిగి ఉద్యోగంలో చేరినట్లయితే లేదా పునర్వివాహం చేసుకున్నట్లయితే వారి పింఛను మొత్తంలో లేదా అర్హతలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో డిజిటల్ సిస్టమ్ ఆ మార్పులను తనంతట తానుగా గుర్తించలేదు. కాబట్టి, ఈ పెన్షనర్లు తప్పనిసరిగా మాన్యువల్‌గా అంటే తమ పింఛను పంపిణీ కార్యాలయం లేదా బ్యాంకుకు నేరుగా వెళ్లి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తమ కొత్త స్థితి (ఉద్యోగంలో చేరినట్లు లేదా పునర్వివాహం చేసుకున్నట్లు) గురించి సరైన సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి, వీరు అదనపు పత్రాలను కూడా సమర్పించవలసి ఉంటుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తయారు చేయించే ముందు కొన్ని ముఖ్యమైన వివరాలు అందుబాటులో ఉండాలి. మొబైల్ నంబర్, పీపీఓ నంబర్, బ్యాంక్ ఖాతా సంఖ్య, పింఛను పంపిణీ చేసే అథారిటీ, పింఛను ఆమోదించిన అథారిటీ వంటి వివరాలు తప్పనిసరి. వీటితో పాటు, ఆధార్ అనుసంధానించబడిన బయోమెట్రిక్ ధృవీకరణ (వేలిముద్ర/ఐ-స్కానింగ్) తప్పనిసరి. కొన్నిసార్లు తప్పు సమాచారం ఇవ్వడం లేదా బయోమెట్రిక్ ధృవీకరణలో సమస్యలు రావడం వల్ల లైఫ్ సర్టిఫికెట్ రిజెస్ట్ అయినట్లు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆందోళన చెందకుండా, వెంటనే తమ పింఛను పంపిణీ ఏజెన్సీని సంప్రదించి, సరైన సమాచారంతో కొత్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవాలి.