₹2,400-Crore Scam: రూ. 2400 కోట్ల భారీ స్కామ్: సన్నీ లియోన్‌తో పాటు కన్నడ స్టార్లకు సీఐడీ నోటీసులు..
సన్నీ లియోన్‌తో పాటు కన్నడ స్టార్లకు సీఐడీ నోటీసులు..
₹2,400-Crore Scam: కర్ణాటకలో సంచలనం సృష్టించిన శివమ్ అసోసియేట్స్ ఆర్థిక మోసం వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమను చుట్టుముట్టింది. దాదాపు 40 వేల మందికి పైగా ప్రజల నుంచి రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ కేసులో... బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌తో పాటు పలువురు కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులకు కర్ణాటక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
కోటి రూపాయల ఐటెం సాంగ్ రెమ్యూనరేషన్..
బాధితుల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మును ఈ సంస్థ అధినేత శివానంద నీలణ్ణవర్ విలాసాలకు, సినిమా ప్రాజెక్టులకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. 2023లో శివానంద నిర్మించిన ఛాంపియన్ అనే కన్నడ చిత్రంలో సన్నీ లియోన్ ఒక ప్రత్యేక గీతంలో నటించింది. ఈ పాట కోసం సన్నీ లియోన్‌కు ఏకంగా రూ.1 కోటి పారితోషికం ఇచ్చినట్లు బ్యాంక్ లావాదేవీల ద్వారా సీఐడీ నిర్ధారించింది. ప్రజలను ముంచి వసూలు చేసిన డబ్బునే ఆమెకు ఫీజుగా ఇచ్చారనే కోణంలో పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.
సీఐడీ రాడార్‌లో కన్నడ స్టార్ హీరో, హీరోయిన్లు
ఈ లీలలు ఇంతటితో ఆగలేదు. గతేడాది డిసెంబరులో ఈ సంస్థ ప్రజల సొమ్ముతో అత్యంత వైభవంగా నిర్వహించిన కన్నడ ఉత్సవం అనే ఈవెంట్ ఇప్పుడు ఇతర నటులను ఇరుకున పెట్టింది. ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు గానూ భారీగా పారితోషికాలు అందుకున్నారనే బలమైన అనుమానంతో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఈ జాబితాలో ప్రముఖ నటులు డాలి ధనుంజయ్, సప్తమీ గౌడ, వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేది తదితరులు ఉన్నట్లు సమాచారం.
ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీకి మళ్లించిన ఈ భారీ పోంజీ కుంభకోణంలో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు కర్ణాటకలోనూ, అటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.